93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకున్న మీడియా మొఘల్
బిలియనీర్, మీడియా మెఘల్ రూపర్ట్ మర్దోక్ మరో సారి వార్తల్లో నిలిచారు. 93 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లి చేసుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: బిలియనీర్, మీడియా మెఘల్ రూపర్ట్ మర్దోక్ మరో సారి వార్తల్లో నిలిచారు. 93 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాను ఐదో పెళ్లి చేసుకున్నారు. ఈ వృద్ధ జంట శనివారం కాలిఫోర్నియాలోని మర్దోక్ ఎస్టేట్‌లో మొఘరాలో వివాహం చేసుకున్నారు. న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్ యూఎస్ ఫుట్‌బాల్ జట్టు యజమాని రాబర్ట్ క్రాఫ్ట్, ఆయన భార్య డానా బ్లుమ్ బెర్గ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
గతేడాది లెస్లీ స్మిత్ తో నిశ్చితార్థం
మర్దోక్ ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకొని వారితో తెగదెంపులు చేసుకున్నారు. గతేడాది 65 ఏళ్ల యాన్ లెస్లీ స్మిత్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరి ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. తనకు చాలా సంతోషంగా ఉందనీ తను మళ్లీ ప్రేమలో పడ్డాననీ ఇదే తన చివరి వివాహం అవుతుందని నిశ్చితార్థం సమయంలో రూపర్ట్ మర్దోక్ అన్నారు. నాలుగో భార్య అయిన జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకుని ఏడు నెలలు కూడా కాకముందే ఆయన లెస్లీతో నిశ్చితార్థం చేసుకొని.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే నిశ్చితార్థం అయిన వారాల వ్యవధిలోనే లెస్లీతో ఆయన బంధం తెగిపోయింది.
మర్దోక్ మాజీ భార్యలు ఎవరంటే..
మర్దోక్ మొదటిసారి ఫ్లైట్ అటెండెంట్ పాట్రీషియా బుకర్‌ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరు 1967 వరకు కలిసే ఉన్నారు. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత అన్నా మరియా ను వివాహం చేసుకుని.. 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత వెండీ డెంగ్‌ని పెళ్లిచేసుకుని.. 2013 వరకు కలిసే ఉన్నారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత 2016లో జెర్రీ హాల్‌ను నాలుగో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన.. ఆరేళ్లకే విడాకులు తీసుకున్నారు. మర్దోక్ కు మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారు.
ఎలీనా జుకోవాకు రెండో పెళ్లి
రష్యాకు చెందిన ఎలీనా జుకోవా అమెరికాకు వలస వచ్చారు. ఆమెకు ఇది రెండో వివాహం. గతంలో మాస్కో ఆయిల్ బిలియనీర్ అలెగ్జాండర్‌తో ఆమెకు వివాహమైంది. కొన్ని కారణాల రీత్యా వీరిద్దరూ విడిపోయారు. ఈ జంటకు ఓ కుమార్తె దాషా కూడా ఉంది. ఆమె రష్యన్ ఓలిగార్క్ రోమన్ అబ్రమోవిచ్‌ను పెళ్లి చేసుకుని విడిపోయింది.