Mamatha: నాకు మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు.. మమతా బెనర్జీ
ఇండియా కూటమి చీఫ్ పదవిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమి చీఫ్ పదవిపై తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamath benarjee) ఇటీవల పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కూటమిలోని పలువురు నేతలు ఆమెకు మద్దతివ్వగా తాజాగా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పుర్బా మేదినీపూర్‌లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ తనకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు చెప్పారు. ‘ఇండియా అలయెన్స్ చీఫ్ విషయంలో నా పట్ల చూపిన గౌరవానికి ప్రతి ఒక్కరికీ నేను రుణపడి ఉంటా. వారు పూర్తి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. అలాగే వారి పార్టీలు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇండియా కూటమి మరింత ముందుకెళ్లాలని ఆశిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది నేనే. దానికి నాయకత్వం వహిస్తున్న వారు విధానాలను సరిగా అమలు చేయలేరు. కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి. పశ్చిమ బెంగాల్ నుంచే కూటమికి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని చెప్పారు. దీంతో ఇండియా కూటమికి చెందిన శివసేన (యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.