Mamata Banerjee : కఠిన చట్టాలు కావాల్సిందే.. రేప్ కేసుల‌పై ప్రధాని మోడీకి దీదీ లేఖ

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా‌లో జూనియర్ వైద్యురాలిపై దురాగతం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం లేఖ రాశారు.

Update: 2024-08-22 13:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా‌లో జూనియర్ వైద్యురాలిపై దురాగతం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం లేఖ రాశారు. రేప్ కేసులలో దోషులుగా తేలే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకురావాలని ఆమె కోరారు. ‘‘నేను మీ(ప్రధాని) దృష్టికి తీసుకొచ్చేది ఏమిటంటే.. దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడుల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. చాలా కేసుల్లో మహిళలపై లైంగిక దాడితో పాటు హత్యలు కూడా జరుగుతున్నాయి. మన దేశంలో ప్రతిరోజూ దాదాపు 90 లైంగికదాడి కేసులు నమోదవుతున్నాయి’’ అని లేఖలో మమతా బెనర్జీ వివరించారు. ‘‘ఇలాంటి ఘటనల వల్ల మన సమాజం విశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ తరుణంలో దేశ మహిళలు సురక్షితంగా, భద్రంగా ఫీల్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని దీదీ పేర్కొన్నారు.

దురాగతాలకు అడ్డుకట్ట వేయాలంటే..

‘‘ఇలాంటి దురాగతాలకు అడ్డుకట్ట వేయాలంటే ఒక సమగ్ర విధానం, కఠినమైన చట్టాలు అత్యవసరం. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని అత్యంత కఠినంగా శిక్షించేలా చట్టాలు ఉండాలి’’ అని ప్రధానమంత్రి మోడీని మమతా బెనర్జీ కోరారు. ‘‘మహిళలపై లైంగిక దాడుల కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈమేరకు చట్టాలలో సవరణలు చేయాలి. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందాలి. ఈ కేసుల దర్యాప్తు 15 రోజుల్లోగా పూర్తయ్యేలా నిబంధనలు ఉండాలి’’ అని మమతా బెనర్జీ తన లేఖలో పేర్కొన్నారు. జూనియర్ వైద్యురాలి కేసు దర్యాప్తు విషయంలో బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి దీదీ లేఖ రాయడం గమనార్హం. హత్యాచార ఘటన చోటుచేసుకున్న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీపై అల్లరిమూకల దాడిని నియంత్రించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందంటూ ఇటీవలే సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. మమతాబెనర్జీ మాత్రం ఆ దాడి వెనుక బీజేపీ, వామపక్షాల కార్యకర్తలే ఉన్నారని వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News