ప్రియాంక గాంధీ కోసం రంగంలోకి మమతా బెనర్జీ..!

సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నాయి.

Update: 2024-06-22 10:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వయనాడ్‌లో ప్రియాంక గాంధీ తరపున ప్రచారం చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇటీవల ఎన్నికల్లో ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం, ముఖ్యంగా కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటున్నట్లు కనిపించడంతో మమతా బెనర్జీ మోడీని ఎదుర్కొడానికి కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని చూస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి.

రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గాలలో భారీ ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఆయన వాటిలో ఏదో ఒక్క స్థానానికి పరిమితం కావాల్సి రావడంతో గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వయనాడ్ లోక్‌సభ స్థానంలో ప్రియాంక గాంధీని రంగంలోకి దించుతున్నారు. ఇప్పుడు ఆమెకు మద్దతుగా మమతా బెనర్జీ ప్రచారం చేస్తారని ప్రచారాలు రావడంతో ప్రియాంక, వయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలుస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

గత కొంత కాలంగా మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. మమతపై అధీర్ రంజన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కావాలనే ఎదగకుండా చేస్తున్నారని ఆయన మమతా విమర్శలు చేయడంతో టీఎంసీ- కాంగ్రెస్‌ పోత్తు చర్చలు విఫలం అయ్యాయి. కానీ ఎన్నికలు ముగిసిన ప్రస్తుతం టీఎంసీతో సంబంధాలను మెరుగుపర్చుకోటానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి అటువైపు నుంచి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News