బిగ్ న్యూస్: పొత్తులపై మమతా బెనర్జీ సెన్సేషనల్ కామెంట్స్.. ఆ ఒక్క ప్రకటనతో షాక్‌లో విపక్షాలు..!
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికల్లో పొత్తుపై తేల్చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలోనూ భాగస్వామ్యం కాబోదని స్పష్టం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికల్లో పొత్తుపై తేల్చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలోనూ భాగస్వామ్యం కాబోదని స్పష్టం చేశారు. గురువారం ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ, త్రిపురతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా వెస్ట్ బెంగాల్ లోని సాగర్‌దిగి నియోరజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో మమత మాట్లాడుతూ.. 2024లో టీఎంసీ ఏ కూటమిలో ఉండబోదని అన్నారు. పార్టీ ప్రజాకూటమితోనే ఉంటుందని తేల్చేశారు. సాగర్ దిగిలో బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌లు తమ మధ్య ఓట్లను బదిలీ చేసుకున్నాయని ఆరోపించారు. వామపక్ష-కాంగ్రెస్ కూటమి అనైతికం అని పేర్కొన్న ఆమె ఇక కాంగ్రెస్, సీపీఎం మాట వినాల్సిన పనిలేదని బీజేపీతో ఉన్న వారితో తృణమూల్ చేతులు కలపబోదని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ సాయం తీసుకోవాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఢీ కొట్టాలటే విపక్షాలు ఐక్యంగా ఉండి పోరాటం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ స్థాయిలో విపక్షాల కూటమిపై జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ పిడుగులాంటి ప్రకటన చేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ టార్గెట్‌గా ఆమె చేసిన వ్యాఖ్యలు విపక్ష వర్గంలో దుమారం రేపుతున్నాయి. మమతా కామెంట్స్‌కు ముందురోజే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ఉమ్మడి ప్రధాని అభ్యర్థి విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థి రేసులో స్టాలిన్ పేరును కూడా కొట్టివేయలేమని ఫరూఖ్ అబ్దుల్లా లాంటి నేతలు వ్యాఖ్యలు చేశారు. ఇక గురువారం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొత్తులపై స్పందిస్తూ కాంగ్రెస్ ఓ మెట్టు దిగితే తాము ఆలోచన చేస్తామనే సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో ఇక కటీఫ్ అని క్లారిటీ ఇవ్వడం సెన్సేషనల్ అవుతోంది. రాబోయే ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆ కూటమికి కాంగ్రెస్ పార్టీనే నాయకత్వం వహిస్తుందన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గేను మమతా చేసిన తాజా వ్యాఖ్యలు షాక్‌కు గురిచేసేలా ఉన్నాయి.