Mamata Banerjee : బెంగాల్ ప్రజల కోసం రాజీనామాకు రెడీ : మమతా బెనర్జీ

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్ ప్రజల బాగు కోసం రాజీనామా చేయడానికి తాను సిద్ధమని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.

Update: 2024-09-12 14:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమ బెంగాల్ ప్రజల బాగు కోసం రాజీనామా చేయడానికి తాను సిద్ధమని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపాలనే ప్రయత్నం గురువారం రోజు కూడా కొలిక్కిి రాలేదని ఆమె వెల్లడించారు. ఈ ప్రతిష్టంభన వల్ల వైద్యసేవలు స్తంభించి అసౌకర్యం కలుగుతున్నందుకు తనను క్షమించాలని బెంగాల్ ప్రజలను దీదీ కోరారు. చర్చల విషయంలో ఇంకా రాజీకి రానప్పటికీ తనకు జూనియర్ డాక్టర్లపై కోపంలేదని.. పెద్ద మనసుతో వాళ్లను క్షమిస్తున్నానని చెప్పారు. వైద్యుల నిరసనల వల్ల ప్రజారోగ్య వ్యవస్థ స్తంభించిందని.. అయినా జూనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన తనకు లేదని మమత స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపడానికి తాను మూడుసార్లు ప్రయత్నించానని.. అయినా సఫలం కాలేకపోయానని దీదీ తెలిపారు.

కోల్‌కతాలోని రాష్ట్ర సచివాలయం వేదికగా గురువారం సాయంత్రం 5.25 గంటలకు తనతో చర్చలకు రావాలని జూనియర్ డాక్టర్లకు సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. చర్చల్లో పాల్గొనేందుకు సెక్రటేరియట్‌కు మమత సకాలంలో చేరుకున్నారు. డాక్టర్లు కూడా సెక్రటేరియట్ గేట్ల వద్దకు చేరుకున్నారు. అయితే సీఎం మమతతో జరగబోయే చర్చల కార్యక్రమాన్ని లైవ్‌లో టెలికాస్ట్ చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. బెంగాల్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ మనోజ్ పంత్ అందుకు నో చెప్పారు. దీంతో డాక్టర్లు సెక్రటేరియట్‌లోని సమావేశ మందిరంలోకి వచ్చేందుకు నిరాకరించారు. దీంతో మమతా బెనర్జీ దాదాపు గంటన్నర పాటు మీటింగ్ హాల్‌లో ఒంటరిగా కూర్చొని జూనియర్ డాక్టర్ల కోసం ఎదురుచూశారు. ఎంతకూ వారు రాకపోవడంతో ఎమోషనల్ అయిన మమతా బెనర్జీ.. బెంగాల్ ప్రజల బాగు కోసం తాను రాజీనామా చేసేందుకు రెడీ అని ప్రకటించారు. కాగా, మమతా బెనర్జీతో జరిగే చర్చల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయిస్తామని బెంగాల్ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ మనోజ్ పంత్ ప్రకటించారు. దానికి కూడా డాక్టర్లు ఒప్పుకోలేదు.


Similar News