Maharashtra Elections: మహారాష్ట్రలో పోటాపోటీ ప్రచారం.. అధికార, ప్రతిపక్షాల మ్యానిఫెస్టో ఎలా ఉంది?
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత సుమారు నెల రోజులపాటు మహారాష్ట్రలో క్యాంపెయినింగ్.. ప్రచార హోరు, హామీల జోరు అన్నట్టుగా సాగింది. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనుంది.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(Maharashtra Assembly Elections) 20వ తేదీన జరగనుండటంతో సోమవారం సాయంత్రానికి ప్రచారపర్వం(Election Campaign) ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత సుమారు నెల రోజులపాటు మహారాష్ట్రలో క్యాంపెయినింగ్.. ప్రచార హోరు, హామీల జోరు అన్నట్టుగా సాగింది. మహాయుతి(Mahayuti Alliance), మహా వికాస్ అఘాడీ(Maha Vikas Aghadi) నాయకులతోపాటు అగ్రనేతలు ప్రధాని మోడీ(PM Modi), కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి, కాంగ్రెస్ వైపు నుంచి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇరువైపుల నుంచి మరికొందరు కీలక నాయకులు ప్రచారంలో మునిగితేలారు. ఒకరిపై మరొకరు ఘాటైన విమర్శలు, పదునైన నినాదాలు ఎక్కుపెట్టారు. ఎత్తుకు పై ఎత్తులు వేశారు. అనూహ్యంగా బీజేపీ తొలిసారిగా ఇక్కడ పంట రుణమాఫీ ప్రకటించిందంటే ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో అర్థం చేసుకోవచ్చు.
మహాయుతి పది హామీలు:
మహాయుతి పది గ్యారంటీలతో మ్యానిఫెస్టో(Mahayuti Manifesto) ప్రకటించింది. మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం రూ. 1,500 నుంచి రూ. 2,100కు పెంపు, పంట రుణమాఫీ, అవసరమైన ప్రతి ఒక్కరికీ కూడు, గూడు హామీ, నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ, 25 లక్షల ఉద్యోగాల కల్పన, 45 వేల గ్రామాలకు రోడ్ల అనుసంధానం, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు వేతన పెంపు, సౌర, పునరుత్పాదక విద్యుచ్ఛక్తిపై పెట్టుబడులు పెట్టి విద్యుత్ బిల్లులపై 30 శాతం తగ్గింపు వంటి హామీలను పేర్కొంది. అధికారం చేపట్టిన 100 రోజుల్లో 2029 మహారాష్ట్ర విజన్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
ఎంవీఏ ఐదు గ్యారంటీలు:
ఇక మహా వికాస్ అఘాడీ ఐదు కీలక గ్యారంటీలతో మ్యానిఫెస్టో(MVA Manifesto) ప్రకటించింది. మహిళలకు నెలవారీగా రూ. 3,000తోపాటు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 3 లక్షల వరకు రుణమాఫీ, కుల గణన, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత, 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్, ఉచిత మెడిసిన్స్, నిరుద్యోగ యువకులకు నెలకు రూ. 4 వేల భృతి వంటి హామీలను పేర్కొంది.
ఎత్తుకు పై ఎత్తు:
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల జనాభా దామాషాలు తెలిస్తే పాలసీ రూపకల్పనలో అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా నిర్ణయాలు జరుగుతాయని, అందుకోసం తాము కుల గణన చేపడుతామని కాంగ్రెస్ కూటమి ప్రకటించింది. కానీ, ఇది ప్రజలను విభజించడమేనని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బాటేంగేతో కటేంగే(విడిపోతే బలహీనమవుతాం) అని యూపీ సీఎం యోగి.. ఏక్ హై తో సేఫ్ హై అని కొంత మార్చి ప్రధాని మోడీ ఇచ్చిన నినాదామూ కుల గణనకు కౌంటరే. డరేంగేతో మరేంగే(భయపడితే చావే) అని ఖర్గే రివర్స్ కౌంటర్ వేశారు. తప్పుదారి పట్టించొద్దని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీకి ఏటీఎం వంటివని, అక్కడి ప్రజల డబ్బును ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నదని ఎదురుదాడికి దిగింది. అలాగే.. ఆ రాష్ట్రాల్లో ప్రకటించినట్టుగా గ్యారంటీల అమలు జరగడం లేదని ఆరోపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపింది. గ్యారంటీలను అమలు చేస్తున్నామని కాంగ్రెస్ సీఎంలు ముక్తకంఠంతో చెప్పారు. తాము రుణమాఫీ కూడా చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే తాము ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తామని, వారంతా కర్ణాటకకు వచ్చి గ్యారంటీల అమలు తీరును చూసి వెళ్లాలని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆఫర్ చేశారు. ఒక వేళ ప్రజల డబ్బును మహారాష్ట్ర ఎన్నికల ఖర్చులకు వాడినట్టు ప్రధాని మోడీ ఆయన చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సిద్ధరామయ్య సవాల్ చేశారు. కాగా, అధికారంలో ఉన్న రెండున్నరేళ్లలో మహాయుతి అమలు చేసిన లడ్కీ బహిన్ వంటి పథకాలు సత్ఫలితాలను ఇస్తాయని అధికారపక్ష నాయకులు భావిస్తున్నారు. ఆ పథకాలనూ విస్తృతంగా ప్రచారం చేశారు.
తెలుగు ఓటర్లూ గణనీయంగా ఉండటంతో షోలాపూర్, భీవండి, నాందేడ్, పూణె, ముంబయి, చంద్రాపూర్ వంటి ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క సహా పలువురు ప్రచారం చేశారు. మహాయుతికి మద్దతుగా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్‌లు ప్రచారం చేశారు.
క్యాంపెయిన్‌కు ఫుల్‌స్టాప్
రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. 4,140 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఫలితాలు 23వ తేదీన వెలువడనున్నాయి. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనుంది.