‘ఐదో విడత’ సమరం.. 695 మంది అభ్యర్థులు.. 8.95 కోట్ల మంది ఓటర్లు

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌ సోమవారం జరగనుంది.

Update: 2024-05-19 14:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్‌ సోమవారం జరగనుంది. ఆరు రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల పండుగ జరగనుంది. వీటిలో ఉత్తర​ప్రదేశ్‌లోని 14, మహారాష్ట్రలోని 13, బెంగాల్‌లోని 7, బిహార్‌లోని 5, ఒడిశాలోని 5, జార్ఖండ్‌లోని 3, జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌లోని చెరో లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వారిలో 613 మంది పురుషులు, 82 మంది మహిళలు ఉన్నారు. ఈ అభ్యర్థుల భవితవ్యాన్ని 8.95 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఓటర్లలో 4.69 కోట్ల మంది పురుషులు, 4.26 కోట్ల మంది మహిళలు, 5,409 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ కోసం 94,732 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సిబ్బంది తరలింపు, భద్రతా సిబ్బంది మోహరింపు కోసం 17 ప్రత్యేక రైళ్లు, 508 హెలికాప్టర్ సర్వీసులను వినియోగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (రాయ్‌బరేలీ), రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ (లక్నో), కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ (అమేథీ), బీజేపీ సీనియర్ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ (సరన్), కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ (నార్త్ ముంబై), లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ (హాజీపూర్), రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌ కుమారుడు కరణ్‌ భూషణ్‌(కైసర్ గంజ్) వంటి ప్రముఖుల భవితవ్యం ఈ విడతలోనే తేలనుంది.

2019లో రిజల్ట్ ఇదీ..

ఐదో విడత పోలింగ్ జరగనున్న 49 లోక్‌సభ స్థానాలలో 2019 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయనే వివరాల్లోకి వెళితే.. అప్పట్లో మోడీ వేవ్ ప్రభావంతో 32 సీట్లను బీజేపీయే గెల్చుకుంది. 7 స్థానాల్లో శివసేన (ఉద్ధవ్), నాలుగు స్థానాల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ, 2 స్థానాల్లో బిజూ జనతాదళ్ గెలిచాయి. కాంగ్రెస్ ఒకే సీటును గెలవగలిగింది.

379 స్థానాల్లో పూర్తి..

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఇప్పటివరకు నాలుగు విడతల్లో 379 లోక్‌సభ స్థానాల్లో పూర్తయింది. ఐదో విడతలో 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఆరో విడత కోసం ఈనెల 25న, చిట్ట చివరిదైన ఏడో విడత కోసం జూన్ 1 పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గత ఎన్నికల్లో ముంబై, థానే, లక్నో నగరవాసులు ఓటింగ్​ పట్ల ఉదాసీనత కనబర్చారు. సోమవారం పోలింగ్​లో ఈ ప్రాంతాలకు చెందిన పౌరులు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ఓటు వేయరని అర్బన్​ ఓటర్లపై ఉన్న అపవాదును చెరిపివేయాలని కోరింది. మే 3న జరిగిన రెండో విడత పోలింగ్​లో దేశంలోని పలు మెట్రోపాలిటన్ నగరాల్లో నమోదైన ఓటింగ్ నిరాశ కలిగించిందని ఈసీ గుర్తుచేసింది.

Tags:    

Similar News