ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై శివసేన యూబీటీ నాయకులు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై శివసేన యూబీటీ నాయకులు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 24 గంటల్లోగా ఇండియా కూటమి తమ అభ్యర్థి పేరుని ప్రకటిస్తుందని తెలిపారు. ప్రధాని పదవికి చాలా మంది అభ్యర్థులు ఉన్నారని ఆసక్తికర కామెంట్లు చేశారు. ఫలితాలు వచ్చిన 24 గంటల్లోనే అభ్యర్థి ఎవరనేది తెలుస్తుందన్నారు. ప్రతిపక్ష కూటమి నేతలందరూ ఢిల్లీలో సమావేశమవుతారని తెలిపారు. ప్రధాని ఎవరనేది అప్పుడే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఈసీకి 17 ఫిర్యాదులు
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై ప్రతిపక్షాల నుంచి వచ్చన ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదన్నారు. రామ్ లల్లా పేరుతో అమిత్ షా ఓట్లు అడిగారని దానిపైనా ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఈసీకి మొత్తం 17 ఫిర్యాదులు చేశామని.. వాటిపైన ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోదీలాగే ఈసీ కూడా ధ్యానం చేస్తుందా? అని మండిపడ్డారు.
మహారాష్ట్రకు చెందిన 12 మంది కలెక్టర్లతో అమిత్ షా భేటీ
ఓట్ల లెక్కింపునకు ముందు అమిత్ షా దేశవ్యాప్తంగా ఉన్న 150 మంది కలెక్టర్లతో భేటీ నిర్వహించారని జైరాం రమేశ్ ఆరోపించారు. ఆయన ఆరోపణలపై సంజయ్ రౌత్ స్పందించారు. ఇది చాలా తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన 12 మంది కలెక్టర్లు అమిత్ షా నిర్వహించిన భేటీలో పాల్గొన్నారని ఆరోపించారు. మరోవైపు, మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ పై సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ ఓటమిపై ప్రజలు సంబురాలు చేసుకుంటారని సెటైర్ వేశారు.