బీజేపీకి అచ్చిరాని అయోధ్య సెంటిమెంట్.. ఫైజాబాద్ లో ఇండియా కూటమి అభ్యర్థి ముందంజ
ఉత్తరాదిలో ఎన్నికల ఫలితాలు అందర్నీ షాక్ కు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైంది.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాదిలో ఎన్నికల ఫలితాలు అందర్నీ షాక్ కు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైంది. బీజేపీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటి అయోధ్యలో రామమందిర నిర్మాణం. ఆ హామీని కాషాయ పార్టీ నెరవేర్చింది కూడా. అయోధ్య సెంటిమెంట్ తో బీజేపీ దూసుకుపోతుందని అందరూ భావించారు. కానీ, ఇక్కడ కమలం పార్టీ అనుకున్న రామనామం పనిచేయలేదు. అయోధ్య పరిధిలోకి వచ్చే నియోజకవర్గమైన ఫైజాబాద్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి లల్లూసింగ్ పై 7 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
బీజేపీకి 300 కన్నా తక్కువ సీట్లు వచ్చే ఛాన్స్..
ఉత్తరప్రదేశ్ లోని 80 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ 36 సీట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ కేవలం 34 స్థానాల్లోనే గెలుపు దిశగా పయనిస్తుంది. అయోధ్యలో రామమందిర నిర్మిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నెరవేర్చింది. జనవరిలో ప్రధాని మోడీ అయోధ్య రామ్ లల్లా ఆలయాన్ని గ్రాండ్ గా ఓపెన్ చేశారు. అయితే, ఈ దెబ్బతో యూపీలోని సీట్లన్నీ బీజేపీ వస్తాయని అందరూ ఊహించారు. ఆ అంచనాలను తారుమారు చేస్తూ.. అక్కడ ఇండియా కూటమి అధిక సీట్లను దక్కించుకుంటుంది. అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న ఫైజాబాద్ లోనూ సమాజ్ వాదీ పార్టీ విజయం దిశగా సాగుతోంది. కాగా.. ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉండటంతో.. బీజేపీ 300 కంటే తక్కువ సీట్లకు పరిమితం కావచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.