దేశంలో ఆరో దశ పోలింగ్.. బరిలో 889 మంది అభ్యర్థులు

మే 25న ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు

Update: 2024-05-23 14:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో ఐదు దశలు పూర్తయ్యాయి. గురువారంతో ఆరో దశ పోలింగ్ కోసం ప్రచారానికి కూడా తెరపడింది. మే 25న(శనివారం) ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. శుక్రవారం ఎన్నికల సంఘం, పోలీసు శాఖ ఓటింగ్ ప్రక్రియ కోసం ఏర్పాట్లు చేయనున్నాయి. ఈ ఆరో దశలో బీహార్ (8), హర్యానా (10), జమ్మూకశ్మీర్ (1), జార్ఖండ్ (4), ఢిల్లీ(7), ఒడిశా (6), ఉత్తరప్రదేశ్ (14), పశ్చిమ బెంగాల్ (8) స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, అత్యధికంగా హర్యానాలో 223 మంది, అత్యల్పంగా జమ్మూ కశ్మీర్‌లో 20 మంది పోటీలో ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 162 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బీహార్‌లో 86 మంది, జార్ఖండ్‌లో 93 మంది, ఒడిశాలో 64 మంది, పశ్చిమ బెంగాల్‌లో 79 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీస్క్షించుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో బన్సూరి స్వరాజ్, మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్, మనోహర్ లాల్ ఖట్టర్, దీపేంద్ర సింగ్ హుడా వంటి కీలక అభ్యర్థులు ఉన్నారు.

ఇప్పటివరకు జరిగిన ఐదు దశల పోలింగ్‌లో ప్రజలు క్రితం కంటే మెరుగ్గా ఓటేశారు. 49 నియోజకవర్గాల్లో జరిగిన ఐదో దశలో 2019 కంటే మెరుగ్గా 62.15 శాతం ఓటింగ్ జరిగింది. అంతకుముందు 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాల్లో 67.25 శాతం, మూడో దశలోని 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 94 స్థానాల్లో 65.68 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 నియోజకవర్గాల్లో 66.71 శాతం, మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో 66.14 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

Tags:    

Similar News