ఐదో విడత పోలింగ్.. భారీగా దిగి వచ్చిన ‘తారలు’
దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ ఘట్టం సోమవారం ముగిసింది.
దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ ఘట్టం సోమవారం ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.47 శాతం ఓటింగ్ నమోదైంది. బెంగాల్‌లో అత్యధికంగా 73 శాతం, మహారాష్ట్రలో అత్యల్పంగా 48.88 శాతం పోలింగ్ జరిగింది. ఇక లద్దాఖ్‌లో 67.15 శాతం, జార్ఖండ్‌లో 63 శాతం, ఒడిశాలో 60.72 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 57.79 శాతం, జమ్ముకశ్మీర్‌లో 54.49 శాతం, బిహార్‌లో 52.60 శాతం ఓటింగ్ నమోదైంది. కాశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 54.67 శాతం పోలింగ్ నమోదైంది. ఇంత భారీ పోలింగ్ నమోదు కావడం 1984 తర్వాత ఇదే అత్యధికం. 2019 ఎన్నికల్లో బారాముల్లా లోక్‌సభ స్థానంలో 37 శాతమే పోలింగ్ నమోదైంది.
ఒడిశాలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ..
ఐదో విడతలో ఉత్తరప్రదేశ్‌లోని 14, మహారాష్ట్రలోని 13, బెంగాల్‌లోని 7, బిహార్, ఒడిశాలలోని 5, జార్ఖండ్‌లోని 3, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలోని ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్ జరిగింది. ఒడిశాలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ విడతలోనే పోలింగ్ జరిగింది. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగానూ ఇప్పటివరకు ఐదో విడతల్లో 428 లోక్‌సభ స్థానాల్లో ఓటింగ్ జరిగింది. మే 25న ఆరో విడత, జూన్ 1న చిట్ట చివరిదైన ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తారలు దిగివచ్చిన వేళ..
మహారాష్ట్రలోని ముంబైలో రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఓటు వేసేందుకు క్యూ కట్టడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గౌరీగంజ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, శివసేన నేతలు ఉద్ధవ్‌ఠాక్రే, వ్యాపారవేత్తలు రతన్ టాటా, ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ తదితరులు కుటుంబాలతో కలిసి ఓటు వేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర, బీఎస్పీ అధినేత్రి మాయావతి, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, హాకీ ఇండియా చీఫ్ దిలీప్ టిర్కీ, అమితాబ్ బచ్చన్, అజింక్య రహానే ఓటు వేశారు. ఓటువేసిన సినీరంగ ప్రముఖుల్లో జాన్వీ కపూర్, జోయా అక్తర్, రకుల్ ప్రీత్ సింగ్, జాకీ బాగ్నానీ, సంజయ్ దత్, మనోజ్ బాజ్‌పేయ్, అనిల్ కపూర్, హేమా మాలిని, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, శ్రియా శరణ్, దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్, శిల్పా శెట్టి తదితరులు ఉన్నారు.