Lalu Prasad: బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత
ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (76) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరాస్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (76) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరాస్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో గత కొంతకాలంలా లాలూ ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ వెళ్లేందుకు బుధవారం సాయంత్రం 4.05 గంటలకు పాట్నాలో ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. కాగా.. విమానాశ్రయానికి వెళ్తుండగా ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో, ఎయిర్ ఇండియా విమానం ఎక్కాల్సిన ఆర్జేడీ చీఫ్‌ను పరాస్ ఆసుపత్రిలో చేర్పించారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో లాలూ ఆరోగ్యం మరింత దిగజారిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్జేడీ చీఫ్ ని సాయంత్రం ఎయిర్ అంబులెన్స్ లో ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించే అవకాశం ఉంది.
కొంతకాలంగా అనారోగ్యంతో..
ముఖ్యంగా చాలాకాలంగా లాలూ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ముంబైలో హృద్రోగ సమస్యలతో యాంజియోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నారు. దానికి ముందు, 2022లో సింగపూర్‌లో ఆయన కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీకి ఆయనకు డొనేట్ చేశారు. 2014లో లాలూకు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది. మరోవైపు, భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే కుంభకోణం కేసులో లాలూపైన, ఆయన కుటుంబ సభ్యులపైన ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి మార్చి 19 సుమారు నాలుగు గంటల సేపు ఈడీ ఆయనను ప్రశ్నించింది. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఆర్జేడీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు.