అయోధ్య తర్వాత కృష్ణ జన్మభూమి భూవివాదంపై బీజేపీ దృష్టి
అయోధ్య తర్వాత కాశీ, మధుర అంశాలు తమ ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనంతరం కృష్ణ జన్మభూమి భూవివాదం బీజేపీ తదుపరి ప్రాధాన్యతల జాబితాలోకి వస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మధురలో 17వ శతాబ్దానికి చెందిన మసీదు షాహి ఈద్గాను శ్రీకృష్ణుడి జన్మస్థలంపై నిర్మించారని హిందూ పిటిషనర్లు వాదిస్తున్న సంగతి తెలిసిందే. అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఈ ప్రదేశంలో పురావస్తు శాఖ సర్వేకు అనుమతినిచ్చింది. అయోధ్య తర్వాత కాశీ (వారణాసి), మధుర అంశాలు తమ ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయని బీజేపీ ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. అయితే, కాశీ, మధుర కూడా విముక్తి చెందితే హిందువులు ఆలయాలకు సంబంధించిన సమస్యల గురించి మర్చిపోతారని అయోధ్య ఆలయ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ చెప్పిన తర్వాత యూపీ సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయోధ్య 5 వేల సంవత్సరాలకు పైగా అన్యాయానికి బలైందని యోగి తెలిపారు.