Kolkata : క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్.. జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు దర్యాప్తులో సీబీఐ స్పీడ్
దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు సీబీఐకి అందించిన కీలక సమాచారం వివరాలు వెలుగులోకి వచ్చాయి.
దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు సీబీఐకి అందించిన కీలక సమాచారం వివరాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం రోజు తమ ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులతో వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకే చెందిన కొందరు జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్ల పాత్ర ఈ దురాగతంలో ఉందని జూనియర్ వైద్యురాలి పేరెంట్స్ చెప్పినట్లు తెలిసింది. వారందరి పేర్లు, ఇతర వివరాలను కూడా సీబీఐకి అందజేసినట్లు సమాచారం. ఈక్రమంలోనే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు వైద్యాధికారులు, ముగ్గురు జూనియర్ డాక్టర్లు, జూనియర్ వైద్యురాలికి పోస్టుమార్టం నిర్వహించిన ముగ్గురు ఫోరెన్సిక్ వైద్యనిపుణులకు సీబీఐ సమన్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు 30 మందిని ప్రశ్నించేందుకు సీబీఐ టీమ్ రెడీ అవుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. తాజాగా శుక్రవారం కూడా ఆస్పత్రికి చెందిన ఒక ఉద్యోగికి, ఇద్దరు పీజీ ట్రైనీ డాక్టర్లకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 8న రాత్రి ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలితో పాటు విధులు నిర్వర్తించిన సిబ్బందిలో ఈ ముగ్గురు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్టు అయిన సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను శుక్రవారం ఉదయం సీబీఐ టీమ్ ఆర్జీ కర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి సెమినార్ హాల్‌లో అతడితో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించింది.
ఔను.. కాలేజీపై దాడిని ఆపడంలో విఫలమయ్యాం : కోల్‌కతా పోలీస్ కమిషనర్
అంత పెద్దసంఖ్యలో అల్లరిమూకలు వస్తారనే అంచనా లేకపోవడం వల్లే కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీపై గురువారం తెల్లవారుజామున దాడిని ఆపలేకపోయామని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ స్పష్టం చేశారు. ఈవిషయంలో తాము విఫలమయ్యామని ఆయన అంగీకరించారు. ఈ విధంగా దాడి జరగబోతోందనే ఇంటెలీజెన్స్ సమాచారమేదీ తమకు ముందస్తుగా అందలేదన్నారు. ఇక మెడికల్ కాలేజీపై దాడికి పాల్పడిన అల్లరిమూకలలో ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ‘‘అల్లరి మూకలను గుర్తుపట్టండి’’ అని కోరుతూ సోషల్ మీడియాతో తాము చేసిన పోస్టును చూసి నెటిజన్లు నలుగురిని గుర్తించి తమకు సమాచారం అందించినట్లు తెలిపారు. మిగిలిన వారి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ప్రచారం జరుగుతున్న వదంతులను నమ్మొద్దని వైద్య వర్గాలు, ప్రజలకు సూచించారు.
సాక్ష్యాలు దొరకకుండా సంఘటనా స్థలంలో మార్పులు చేశారు : ఎన్‌సీడబ్ల్యూ
ఈ కేసుపై జాతీయ మహిళ కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సెమినార్ హాల్‌లో చాలా మార్పులు చేశారని ఆరోపించింది. పోలీసులు, సీబీఐకి సాక్ష్యాలు దొరకకుండా అక్కడి పరిసరాల్లో మార్పులు చేశారని పేర్కొంది.
బెంగాల్ బీజేపీ చీఫ్ అరెస్టు
కోల్‌కతా మెడికల్ కాలేజీ ఘటనను నిరసిస్తూ శుక్రవారం రోజు బెంగాల్‌లోని అన్ని జిల్లాల్లో బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. కోల్‌కతాలో నిరసన తెలుపుతుండగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. కాలేజీపై జరిగిన దాడిని ఆపలేకపోయినందుకు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కచ్చితంగా అది గ్యాంగ్ రేప్ : స్మృతి ఇరానీ
బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ సీనియర్ నాయకురాలు స్మృతి ఇరానీ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో దీదీ విఫలమయ్యారని మండిపడ్డారు. ‘‘జూనియర్ వైద్యురాలి శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉందని గుర్తించారు. ఆమె శరీరమంతా గాయాలు ఉన్నాయని పోస్టుమార్టంలో తేలింది. ఇంత ఘోరానికి ఒకే వ్యక్తి తెగబడ్డాడని ఎలా అంటారు ? అది కచ్చితంగా గ్యాంగ్ రేపే ’’ అని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. ఈ గ్యాంగ్ రేప్‌ను కప్పి పుచ్చేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు.