Khamenei: అలీ ఖమేనీ వారసుడిగా మోజ్తాబా.. రహస్యంగా ప్రకటించిన ఇరాన్ !
రాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన వారసుడిగా రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీని నియమించినట్టు తెలుస్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ సుప్రీం లీడర్ (Iran supreme leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) తన వారసుడిగా రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీ(Mojtaba Khamenei)ని నియమించినట్టు తెలుస్తోంది. ఇరాన్(Iran) అత్యంత రహస్యంగా ఈ ప్రకటన వెల్లడించినట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 85 ఏళ్ల ఖమేనీ మరణానికి ముందే పదవీ విరమణ చేయనునుండగా.. త్వరలోనే మోజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 26న ఖమేనీ స్వయంగా 60 మంది ఇరాన్ నిపుణుల అసెంబ్లీ సభ్యులతో భేటీ అయ్యారని, ఈ సమావేశంలోనే మోజ్తాబాను తన వారసుడిగా ప్రకటించినట్టు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఖమేనీ ప్రతిపాదనను ఏకగ్రీవంతో ఆమోదించినట్టు వెల్లడించాయి.
అయితే ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని, అసెంబ్లీ సభ్యులకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, నిరసనల భయం కారణంగానే వారసుడి ఎంపికను అత్యంత రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే గత రెండేళ్లుగా మోజ్తాబాను సుప్రీం లీడర్‌గా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కాలంలో ఇరాన్ కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అతని భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే మోజ్తాబా గతంలో ఇరాన్ ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక పదవినీ నిర్వహించలేదు. అయినప్పటికీ సుప్రీం లీడర్‌గా ఆయన నియామకం దాదాపు ఖరారైంది.
కాగా, ఇరాన్‌లో సుప్రీం లీడర్ పదవి రాజకీయ, మత వ్యవస్థలో అత్యున్నతమైనది. దేశంలోని సైనిక, న్యాయ, మతపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే హక్కు సుప్రీం లీడర్‌కు ఉంటుంది. ఆయన నిర్ణయాన్ని ఎవరూ సవాల్ చేయలేరు. ఇక, అలీ ఖమేనీ 1981లో ఇరాన్ అధ్యక్షుడయ్యాడు. 8 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. ఈ క్రమంలోనే1989లో ఇరాన్ సుప్రీం లీడర్ రుహోల్లా ఖొమేనీ (Ruhollah Khomenei) మరణించిన తర్వాత ఆయన వారసుడిగా నియామకమయ్యారు.