ఈ గుళ్లో వాళ్లే నాట్యం చేయాలంటా..?! ఇదేమి చోద్యం!!
సాంకేతిక పరిజ్ఞానంతో 'స్మార్ట్ ఇండియా విరాజిల్లుతోందని సంబరపడుతున్నాము. Kerala Temple Cancels Mansiya PV Performance
దిశ, వెబ్‌డెస్క్ః నానాటికీ అభివృద్ధిచెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో 'స్మార్ట్ ఇండియా విరాజిల్లుతోందని సంబరపడుతున్నాము. అదే సమయంలో, ఇక్కడ మత వివక్ష మరింత వేళ్లీనుతున్నట్లూ కనిపిస్తోంది. ముఖ్యంగా, కొన్ని సంవత్సరాల నుండి ఇండియాలో ఈ పరిణామం ఇంకాస్త పెరుగుతున్న దాఖలాలు లేకపోలేదు. ఇటీవల కర్నాటకలో హిజాబ్ వివాదం నుండి దేశంలో వివిధ చోట్ల ముస్లిములకు హిందూ కార్యకలాపాలలో చోటు లేకుండా చేస్తున్న వైనం తరచుగా వార్తల్లో వస్తున్నాయి. ఈ మధ్య కర్నాటకలోనే దేవాలయాల జాతర్లలో ముస్లింల షాపులను తొలగించడం తర్వాత తాజాగా కేరళలోని త్రిసూర్ జిల్లాలోని ఒక దేవాలయం హిందూయేతర కళాకారులు దేవాలయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన కూడదన్నట్లు వ్యవహరించారు. ఇప్పటికే షెడ్యూల్ చేసిన కార్యక్రమంలో హటాత్తుగా ఓ భరతనాట్య కళాకారిణి నృత్యాన్ని క్యాన్సిల్ చేశారు. తాను హిందువు కాదు కాబట్టి ప్రదర్శన ఇవ్వకుండా నిషేధించినట్లు ముస్లిం కుటుంబంలో జన్మించి, హిందువును పెళ్లాడిన ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి మాన్సియా వి.పి. మీడియాకు తెలిపారు.
త్రిస్సూర్‌లోని ఇరింజలకుడ వద్ద ఉన్న కూడల్మాణిక్యం దేవాలయం పది రోజుల ఉత్సవానికి సిద్ధమవుతోంది. ఇందులో సుమారు 800 మంది కళాకారులు వివిధ కార్యక్రమాలలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ఆలయం రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోని దేవస్వామ్ బోర్డు నిర్వహణలో ఉంది. అయితే, ఇందులో భాగంగా, రాబోయే ఏప్రిల్ 21న ఆలయ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో మాన్సియా పి.వి. ప్రదర్శన ఇవ్వడానికి అన్నీ పూర్తయ్యాయి. అయితే ఆమెను హటాత్తుగా ఈ కార్యక్రమం నుండి తొలగించినట్లు కూడల్మాణిక్యం దేవస్థానం బోర్డ్ ఛైర్మన్ ప్రదీప్ మీనన్ తెలిపారు. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం, భరతనాట్యంలో పీహెచ్‌డీ రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్న మాన్సియా.. హిందువు అయిన సంగీత విద్వాంసుడు శ్యామ్ కళ్యాణ్‌ను వివాహం చేసుకుంది. తనకు ఎలాంటి మతం లేదని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది. అయితే, తాను హిందువు కాకపోవడం వల్ల దేవాలయాల్లో ప్రదర్శన ఇవ్వకుండా అడ్డుకోవడం ఇదే మొదటిసారి కాదని ఆమె తెలిపారు. త్రిసూర్‌లోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం కూడా తాను హిందువు కాదు కాబట్టి ప్రదర్శన ఇవ్వకుండా అడ్డుకున్నట్లు ఆమె అన్నారు. మాన్సియా మొదటి నుండి ఇలాంటి వివక్షను ఎదుర్కుంటూ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలల్లో తన అభిప్రాయాలను బహిరంగంగానే ప్రకటించారు. తనకు మతం లేదని ఆమె పలు సందర్భాల్లోనూ వెల్లడించారు.