Wayanad Landslide: వయనాడ్ విపత్తుపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
గతేడాది వయనాడ్(Wayanad Landslide) లో సంభవించిన ఘోరవిపత్తు ఘటనపై కేరళ ప్రభుత్వం(Kerala Government) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: గతేడాది వయనాడ్(Wayanad Landslide) లో సంభవించిన ఘోరవిపత్తు ఘటనపై కేరళ ప్రభుత్వం(Kerala Government) కీలక నిర్ణయం తీసుకుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతయిన వారిని 'మృతులు'గా ప్రకటించాలని పినరయి సర్కారు నిర్ణయించింది. దీంతో, గల్లంతైన సభ్యుల కుటుంబాలకు ప్రభుత్వ లబ్ధి చేకూరనుంది. విపత్తుల్లో తప్పిపోయిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం అందించడానికి ఈ నిర్ణయం సహాయపడుతుంది. ఈ మేరకు కేరళ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మిస్ అయిన వ్యక్తుల జాబితాను పరిశీలించేందుకు రెవెన్యూ శాఖ అధికారులతో సహా స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ ఉత్తర్వులో ఉంది. స్థానిక స్థాయి కమిటీలో సంబంధిత పోలీస్ స్టేషన్ల పంచాయతీ కార్యదర్శి, గ్రామ అధికారి మరియు స్టేషన్ హౌస్ అధికారి ఉంటారు. ఆ కమిటీ తప్పిపోయిన వ్యక్తుల జాబితాను తయారు చేసి, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA)కి పరిశీలన కోసం సమర్పిస్తుంది. డీడీఎంఏ ఆ జాబితాను పరిశీలించి.. రాష్ట్రస్థాయి కమిటీకి పంపుతోంది. రాష్ట్ర స్థాయి కమిటీ జాబితాను పరిశీలించి ప్రభుత్వానికి పంపుతుందని ఉత్తర్వులో పేర్కొంది. ఆ తర్వాత, రాష్ట్రస్థాయి జాబితాలో పేర్లు ఉన్నవారిని కేరళ ప్రభుత్వం మృతులుగా ప్రకటించి బంధువులకు పరిహారం అందజేస్తుంది.
స్థానిక స్థాయి కమిటీలదే కీలకం..
స్థానిక స్థాయి కమిటీలు సంబంధిత పోలీస్ స్టేషన్లలో తప్పిపోయిన వ్యక్తుల సమాచారాన్ని దాఖలు చేసి ఎఫ్‌ఐఆర్‌లను నిశితంగా పరిశీలించాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. తహశీల్దార్ లేదా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ తప్పిపోయిన వ్యక్తి గురించి వివరణాత్మక విచారణ నిర్వహించాలంది. ఏవైనా అభ్యంతరాలు దాఖలు చేయడానికి 30 రోజుల వ్యవధి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత తప్పిపోయిన వ్యక్తుల జాబితాను ప్రచురించి, వారి తక్షణ బంధువులకు మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తామంది. ఇకపోతే, గతేడాది జులై 30న వయనాడ్ లో కొండచరియలు విరిగిపడటంతో.. 263 మంది చనిపోయారు. మరో, 35 మంది గల్లంతయ్యారు.