కేజ్రీవాల్ ను హింసిస్తున్నారని ఆప్ ఆరోపణలు.. తీహార్ జైలు అధికారుల స్పందన ఇదే
తీహార్ జైళ్లో అరవింద్ కేజ్రీవాల్ కు కూలర్ ఇవ్వట్లేదన్న ఆప్ ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు స్పందించారు.
దిశ, నేషనల్ బ్యూరో: తీహార్ జైళ్లో అరవింద్ కేజ్రీవాల్ కు కూలర్ ఇవ్వట్లేదన్న ఆప్ ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు స్పందించారు. అస్వస్థతతో ఉన్న ఖైదీలకు మాత్రమే జైళ్లో కూలర్లు ఇస్తారని సీనియర్ అధికారి స్పష్టం చేశారు. అధికారులు అలా చేయాలని కోర్టు ఆదేశిస్తుందని తెలిపారు. అంతకుముందు, కేజ్రీవాల్ ను జైళ్లో హింసిస్తున్నారని ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోపించారు. కేజ్రీవాల్‌ను బీజేపీ ఫేక్ కేసులో అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్లినా.. బీజేపీ ప్రభుత్వం శాంతించలేదన్నారు. ఆయన్ని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదన్నారు. కనీసం కూలర్ కూడా లేని సెల్ లో ఆయన్ను ఉంచారని ఫైర్ అయ్యారు.
కనీసం కూలర్ ఇవ్వరా?
ఢిల్లీలో ఉష్ణోగ్రత 48 నుంచి 50 డిగ్రీల మధ్య ఉంటుందన్నారు. తీహార్ జైళ్లో కరుడుగట్టిన నేరస్థులకు సైతం కూలర్లు ఇస్తారని గుర్తుచేశారు. కానీ, కేజ్రీవాల్ కు మాత్రం కూలర్ ఇవ్వలేదని విమర్శించారు. ఆయన ఆరోగ్యంతో బీజేపీ చెలగాటమాడుతోందన్నారు. బీజేపీని, ఢిల్లీ ఎల్జీని ఉద్దేశిస్తూ.. మీరు ఎంకెంత దిగజారిపోతారు? అని అతిశీ ప్రశ్నించారు. మరోవైపు, కేజ్రీవాల్ బరువు గురించి కూడా అతిశీ మాట్లాడారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్లాక బరువు తగ్గారని.. రికార్డు చేసిన బరువును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జైలుకు వెళ్లడానికి ముందు సీఎం 61 కేజీల బరువున్నారని తెలిపారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన మరో మూడు కేజీలు బరువు పెరిగినట్లు చూపించారని అన్నారు. మరోసారి 66 కేజీలకు పైగా ఉన్నట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మధ్యంతర బెయిల్‌పై వచ్చినప్పుడు మునుపటికంటే 7 కిలోలు తగ్గారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యం విషయంలో కేంద్రం డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు.