Kejriwal: బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ను నిలిపివేస్తుంది.. ఆప్ చీఫ్ కేజ్రీవాల్
ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ పథకాన్ని నిలిపి వేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత విద్యుత్ పథకాన్ని నిలిపి వేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గత పదేళ్లుగా దేశ రాజధానిలో అభివృద్ధి పనులను బీజేపీ అడ్డుకుంటోందని ఫైర్ అయ్యారు. బుధవారం జరిగిన ఆప్ ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఎల్జీని ఉపయోగించి ఢిల్లీలోని ఎన్నో ప్రాజెక్టులకు ఆపడానికి కాషాయ పార్టీ ప్రయత్నించిందని విమర్శించారు. కానీ ప్రజలకు సంబంధించిన ఒక్క పనిని కూడా ఆప్ నిలిపివేయలేదని, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు బాగా తెలుసన్నారు. తన హయాంలో ఢిల్లీలో జరిగిన అభివృద్ధి పనులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.
లిక్కర్ పాలసీ కేసులో జైలులో ఉన్న తనకు ఇన్సులిన్ ఇవ్వకుండా చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజల ఆశీస్సులతోనే జైలు నుంచి బయటపడ్డానని తెలిపారు. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రజలందరికీ తెలుసు, కేవలం ఢిల్లీలో ప్రజల కోసం పనిచేస్తున్నందునే జైలుకు పంపారు అని నొక్కి చెప్పారు. ‘త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిచి ఢిల్లీలో జరిగే పనులన్నీ ఆపాలని బీజేపీ ప్లాన్ వేసింది. వారికి ఓటేసి గెలిపిస్తే ఉచిత కరెంటు పథకం ఆపేస్తారు. కరెంటు కోతలూ ఎక్కువవుతాయి. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను నాశనం చేస్తారు’ అని వ్యాఖ్యానించారు.