Karnataka congress: గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్.. కర్ణాటకలో నిరసనలకు పిలుపు

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలం కేటాయింపు స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్‌ను మంజూరు చేస్తూ కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-08-18 13:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలం కేటాయింపు స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్‌ను మంజూరు చేస్తూ కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఆందోళన చేపట్టనున్నట్టు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. పార్టీ శ్రేణులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని హరించి వేశారని మండిపడ్డారు. సిద్దరామయ్యను లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.

సీఎం రాజీనామా చేసే ప్రసక్తే లేదని పార్టీ అంతా సిద్ధరామయ్య వైపే ఉందని స్పష్టం చేశారు. ఒత్తిడికి సిద్ధరామయ్య లొంగిపోరని తెలిపారు. గవర్నర్ నిర్ణయాలపై న్యాయపరంగా పోరాడతామని చెప్పారు. శాంతి యుతంగా నిరసనలు తెలిపాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాగా, సిద్ధరామయ్య తన పదవిని దుర్వినియోగం చేసి మైసూర్‌లోని తన భార్య పార్వతికి నకిలీ పత్రాలను ఉపయోగించి ప్రత్యామ్నాయ సైట్‌లను పొందారనే ఆరోపణలున్నాయి. అయితే ఈ ఆరోపణలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. చట్టపరంగా ఎదుర్కొంటామని ఎటువంటి ఆధారాలు లేకుండానే విచారణకు గవర్నర్ అనుమతిచ్చారని తెలిపారు.

Tags:    

Similar News