Karge: బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోంది.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Malli karjun karge)ఆరోపించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ (Nagpoor)లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే మంచి ప్రభుత్వం అవసరమని నొక్కిచెప్పారు. ప్రజలంతా మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి వైపే ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఎంవీఏనే విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. బీజేపీ నిరంతరం అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందన్నారు. మహారాష్ట్రలోని పలు ప్రాజెక్టులు గుజరాత్‌కు వెళ్లకుండా రాష్ట్రంలోని బీజేపీ అగ్ర నాయకులు అడ్డుకోలేకపోయారన్నారు. ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేని కారణంగానే వారు అభ్యంతరం చెప్పలేదని విమర్శించారు. గత 11 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏ పని చేసిందో చెప్పాలని, కాంగ్రెస్‌తో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాగా, మహారాష్ట్రలో ఈ నెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో వివిధ పార్టీల నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు.