Waqf Board Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు.. 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ ఎంపీలు
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024 పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024 పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ కమిటీలో మొత్తం 21 మంది లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ నుండి 10 మంది ఎంపీల పేర్లను ప్రతిపాదించారు. దీనిలో తెలంగాణ నుంచి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇతర లోక్‌సభ సభ్యులైన గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, కృష్ణ దేవరాయులు, మహ్మద్ జావేద్, కళ్యాణ్ బెనర్జీ, జగదాంబిక పాల్, నిషికాంత్ దూబే, తేజస్వి సూర్య, దిలీప్ సైకియా, ఎ రాజా, దిలేశ్వర్ కమైత్, అరవింద్ సావన్ టి, నరేష్ మాస్కే, అరుణ్ భారతి, అపరాజిత సారంగి, సంజయ్ జైస్వాల్, అభిజిత్ గంగోపాధ్యాయ, మౌలానా మొహిబుల్లా నద్వీ, సురేష్ గోపీనాథ్ ఉన్నారు.
రాజ్యసభ నుంచి ఉన్న10 మంది ఎంపీలలో.. బ్రిజ్ లాల్, డాక్టర్ మేధా విశ్రమ్ కులకర్ణి, గులాం అలీ, డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, సయ్యద్ నసీర్ హుస్సేన్, మహమ్మద్ నదీమ్ ఉల్ హక్, వి విజయసాయి రెడ్డి, ఎం. మహమ్మద్ అబ్దుల్లా, సంజయ్ సింగ్, డాక్టర్ ధర్మస్థల వీరేంద్ర హెగ్గడే ఉన్నారు. ఇదిలా ఉంటే గురువారం లోక్‌సభలో 1995 వక్ఫ్ చట్టంలో సవరణలు తెచ్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది.
ప్రధానంగా వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేయాలని బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే, వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చాలనే నిబంధన ప్రతిపాదిత చట్టంలో మరో వివాదాస్పద అంశంగా మారింది. దీంతో ఈ బిల్లుపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపించనున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.