Congress Manifesto: జమ్మూకశ్మీర్ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్

ఓటర్లను ఆకట్టుకునేందుకు రైతులు, మహిళలు, యువత లక్ష్యంగా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

Update: 2024-09-15 18:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సోమవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. 'హాత్ బద్లేగా హాలాత్ ' పేరుతో విజయం సాధించే లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రైతులు, మహిళలు, యువత లక్ష్యంగా సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. శ్రీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన అధికార ప్రతినిధి పవన్ ఖేరా, పీసీసీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కరా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ ఖేరా.. 'గత 10 ఏళ్లలో ఆశలు, కలల స్మశాన వాటికగా కశ్మీర్ మారిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మా పార్టీ బృందాలు 22 జిల్లాలకు వెళ్లి యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లు, వ్యాపారవేత్తలతో మాట్లాడాయి. వారందరితో చర్చించిన తర్వాత ఈ పత్రం (కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో) తీసుకొచ్చాం. ఇది మా హామీ, మా వాగ్దానం. వాటన్నింటినీ నెరవేరుస్తాం' అని ఖేరా అన్నారు.

ప్రధానంగా ఎన్నికల్లో గెలిస్తే, ప్రకృతి వైపరీత్యాల నుంచి అన్ని రకాల పంటలకు బీమాతో పాటు కిలో యాపిల్‌కు కనీస మద్దతు ధర రూ.72 ఇస్తామని హామీ కాంగ్రెస్‌ ఇచ్చింది. మిగిలిన హామీల్లో..

* పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా జమ్మూకశ్మీర్‌లో మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు.

* భూమిలేని, కౌలుదారు, భూమి ఉన్న వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి రూ. 4,000 అదనపు ఆర్థిక సహాయం.

* ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్న భూమిలేని రైతులకు 99 ఏళ్ల లీజుకు ఏర్పాట్లు.

* జమ్మూకశ్మీర్‌లోని రైతులకు 100 శాతం సాగు నీరు అందేలా అన్ని జిల్లా-స్థాయి నీటిపారుదల ప్రాజెక్టులకు రూ. 2,500 కోట్ల నిధి ఏర్పాటు.

* జమ్మూకశ్మీర్ యువత కోసం, అర్హత కలిగిన యువకులకు ఒక సంవత్సరం పాటు నెలకు రూ. 3,500 వరకు నిరుద్యోగ భృతి హామీ.

* 30 రోజుల్లో ఉద్యోగ క్యాలెండర్‌ ద్వారా ఖాళీగా ఉన్న లక్ష ప్రభుత్వ పోస్టుల భర్తీ.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు..

90 మంది సభ్యుల జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడికానున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నాయి. సీట్ల భాగస్వామ్య ఒప్పందం ప్రకారం, నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 

Tags:    

Similar News