Jika virus: ఫూణేలో జికా వైరస్ కలకలం.. 66 కేసులు నమోదు

మహారాష్ట్రలోని పూణే నగరంలో గత రెండు నెలల్లో 66 జికా వైరస్ కేసులు నమోదయ్యాయని పూణే వైద్య అధికారులు బుధవారం వెల్లడించారు.

Update: 2024-08-07 10:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని పూణే నగరంలో గత రెండు నెలల్లో 66 జికా వైరస్ కేసులు నమోదయ్యాయని పూణే వైద్య అధికారులు బుధవారం వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారిలో 26 మంది గర్భిణులు సైతం ఉన్నారు. అయితే వారిలో ఎక్కువ మంది ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. నలుగురు వ్యక్తులు వైరస్‌ బారిన పడి మరణించారు. ఈ నలుగురు రోగులు 68 నుంచి 78 మధ్య వయస్సు గలవారేనని అధికారులు స్పష్టం చేశారు. మరణించిన వారికి గుండె సంబంధిత వ్యాధులు, కాలేయం, వృద్ధాప్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. జికా వైరస్ మొదటి కేసు జూన్ 20 న ఎరాండ్‌వానే ప్రాంతంలో ఓ వైద్యుడికి నిర్థారణైంది. అనంతరం అతని 15 ఏళ్ల కుమార్తె కూడా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఈ నివేదికలను పంపామని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో జికా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. కాగా, జికా వైరస్‌ సోకిన ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది.

Tags:    

Similar News