జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు విడుదల
ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ మద్రాస్ ఈ ఫలితాలను ప్రకటించింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ మద్రాస్ ఈ ఫలితాలను ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in లో పరీక్ష ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇకపోతే, మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్ లో అర్హత సాధించిన 2,80,200 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది మొత్తం 48,248 మంది విద్యార్ధులు అర్హత సాధించారు. వీరిలో 7,964 మంది అమ్మాయిలు ఉండటం విశేషం. కాగా గతేడాది 43,773 మంది విద్యార్ధులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను క్లియర్ చేశారు.
జేఈఈ టాపర్ ఎవరంటే?
ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి అనే విద్యార్ధి 360 మార్కులకు గానూ 355 సాధించి తొలిర్యాంకు సాధించాడు. ఆ తర్వాత స్థానంలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన ఆదిత్య 346 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. ఐఐటీ మద్రాస్ జోన్‌కు చెందిన భోగలపల్లి సందేశ్ 338 మార్కులతో టాప్ 3 ర్యాంకు సాధించాడు. కాగా, ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేష్‌కుమార్ పటేల్ 322 మార్కులు సాధించి ఏడో ర్యాంకును సాధించగా.. బాలికల్లో తొలి ర్యాంకుని సొంతం చేసుకుంది.
పెరిగిన కటాఫ్ మార్కులు
ఇక ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ మార్కులు పెరిగాయి. జనరల్ కేటగిరికి 93.23 శాతం, ఓబీసీ నాన్-క్రీమీ లేయర్ కేటగిరికి 79.6 శాతం, ఈడబ్ల్యూఎస్ కేటగిరికి 81.3 శాతం, ఎస్సీ కేటగిరికి 60 శాతం, ఎస్టీ కేటగిరికి 46.69 శాతంగా ఉంది.