ఎలక్టోరల్ బాండ్లతో 4 రకాలుగా అవినీతికి పాల్పడిన బీజేపీ: సంచలన విషయాలు వెల్లడించిన జైరాం రమేశ్

రూ.140 కోట్లు విరాళంగా ఇవ్వగా, ఒక నెల తర్వాత రూ.14,400 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది.

Update: 2024-03-15 17:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎలక్టోరల్ బాండ్ల విధానంతో బీజేపీ నాలుగు రకాలుగా అవినీతిని పాల్పడిందని కాంగ్రెస్ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. ఈసీ విడుదల చేసిన ఎన్నికల బాండ్ల డేటాపై ట్విట్టర్ వేదికగా శుక్రవారం స్పందించారు. విరాళాల వివరాలపై సంక్షిప్త విశ్లేషణను వెల్లడించారు. ‘‘1,300 కంటే ఎక్కువ కంపెనీలు, వ్యక్తులు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు అందించాయి. 2019 నుండి బీజేపీకే అత్యధికంగా రూ.6,000 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి’’ అని తెలిపిన ఆయన.. ఈ ఎలక్టోరల్ బాండ్ల డేటా బీజేపీకి చెందిన 4 రకాల అవినీతి విధానాలను బహిర్గతం చేసిందని ఆరోపించారు.

1. ఇచ్చి పుచ్చుకోండి (క్విడ్ ప్రో కో)

‘‘ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ పాల్పడిన 4 రకాల అవినీతిలో మొదటిది క్విడ్ ప్రో కో. బాండ్లను విరాళంగా అందించిన కంపెనీలు ఆపై ప్రభుత్వం నుంచి భారీ ప్రయోజనాలు పొందాయి. వాటిని పరిశీలిస్తే..

* ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా’ సంస్థ బీజేపీకి రూ.800 కోట్లకు పైగా విలువ చేసే ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇచ్చింది. ఆ సంస్థ 2023 ఏప్రిల్‌లో రూ.140 కోట్లు విరాళంగా ఇవ్వగా, కేవలం ఒక నెల తర్వాత రూ.14,400 కోట్ల విలువైన థానే-బోరివాలి ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది.

* ‘జిందాల్ స్టీల్ అండ్ పవర్’ సంస్థ 2022 అక్టోబర్ 7న రూ.25 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను చెల్లించగా, కేవలం 3రోజుల వ్యవధిలోనే 2022 అక్టోబర్ 10న గారే పాల్మా IV/6 బొగ్గు గనిని దక్కించుకుంది.

2) వారాంతం వసూళ్లు

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ పాల్పడిన 4 రకాల అవినీతిలో రెండో రకం వారాంతం వసూళ్లు. ఈ విధానం బీజేపీకి చాలా సులభం. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ ద్వారా కంపెనీలపై దాడి చేయిస్తుంది. అలా బెదిరించి కంపెనీ భద్రత కోసం హఫ్తా డిమాండ్ చేస్తుంది. తాజా జాబితాలో టాప్-30 కంపెనీల్లో కనీసం 14 కంపెనీలపై దర్యాప్తు సంస్థలతో దాడి చేయించింది. ఇందులో హెటెరో ఫార్మా, యశోద హాస్పిటల్ వంటి అనేక కంపెనీలు ఉన్నాయి.

* 2023 డిసెంబర్‌లో ‘షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌’పై ఆదాయపు పన్నుశాఖ దాడులు చేయగా, ఆ తర్వాతి నెల(జనవరి 2024)లోనే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.40 కోట్లు విరాళంగా అందించింది.

* ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్స్’ సంస్థ అత్యధికంగా రూ.1200 కోట్లకు పైగా విరాళాలిచ్చి అతిపెద్ద దాతగా నిలిచింది. ఈ సంస్థపై 2022 ఏప్రిల్ 2న ఈడీ దాడులు చేయగా, 5 రోజుల తర్వాత (ఏప్రిల్ 7) రూ.100 కోట్ల ఎలక్టోరల్ బాండ్‌లను విరాళంగా ఇచ్చింది.

* 2023 అక్టోబర్‌లోనూ ఈ సంస్థపై ఐటీ శాఖ దాడులు చేసింది. దీంతో అదే నెలలో రూ.65 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా అందజేసింది.

3) లంచం తీసుకునేందుకు కొత్త మార్గం

ఎలక్టోరల్ బాండ్ల డేటాలో సరికొత్త విషయం ఒకటి బయటపడింది. బీజేపీ అవినీతికి ఇదే మూడో మార్గం. ఈ విధానంలో కంపెనీలు కేంద్రం నుంచి కొంత సహాయం పొందుతాయి. అలా పొందిన వెంటనే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి తిరిగి చెల్లిస్తాయి.

* ‘వేదాంత’ సంస్థ ‘రాధికాపూర్ వెస్ట్ ప్రైవేట్ బొగ్గు గని’ని 2021 మార్చి 3న పొందింది. ఆ మరుసటి నెలలోనే (ఏప్రిల్) బీజేపీకి రూ.25 కోట్ల ఎలక్టోరల్ బాండ్‌లను విరాళంగా ఇచ్చింది.

* ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా’ కంపెనీ ఆగస్టు 2020లో రూ.4,500 కోట్ల విలువైన జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్‌ను దక్కించుంది. తర్వాత అక్టోబర్‌లో రూ.20కోట్ల ఎలక్టోరల్ బాండ్‌లను విరాళంగా అందజేసింది.

* 2022 డిసెంబర్‌లోనూ ‘మేఘా’ సంస్థ ముంబైలోని బీకేసీ బుల్లెట్ రైలు స్టేషన్ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. అదే నెలలో రూ.56 కోట్లు విరాళంగా ఇచ్చింది.

4) షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ పాల్పడిన 4 రకాల అవినీతిలో ఆఖరిది షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌లోని ప్రధాన సమస్య ఏమిటంటే, కంపెనీ లాభాల్లో కొద్దిశాతం మాత్రమే విరాళంగా ఇవ్వాలనే పరిమితిని తొలగించి, నల్లధనాన్ని డొనేట్ చేయడానికి షెల్ కంపెనీలకు మార్గం సుగమం చేసింది. ఉదాహరణకు.. ‘క్విక్ సప్లై చైన్ లిమిటెడ్’ అనే సంస్థ రూ.410 కోట్ల విరాళం అందజేసింది. కానీ, MoCA ఫైలింగ్‌ల ప్రకారం ఆ కంపెనీ మొత్తం వాటా మూలధన విలువ కేవలం రూ.130 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇలాంటి అనుమానాస్పద విరాళాలు చాలానే ఉన్నాయి. ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్ డేటాను విశ్లేషిస్తున్న కొద్దీ, బీజేపీ అవినీతికి సంబంధించిన అనేక అంశాలు బయటపడుతున్నాయి’’ అంటూ జైరాం రమేశ్ ఆరోపించారు.


Tags:    

Similar News