నాకంటే నా కుటుంబానికే ఇది క్లిష్ట సమయం- ట్రంప్

తన భార్యపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ కు సంబంధించిన సెక్స్ స్కాండల్ కేసులో దోషిగా తేలిన తర్వాత ఈ కామెంట్స్ చేశారు.

Update: 2024-06-02 18:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తన భార్యపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ కు సంబంధించిన సెక్స్ స్కాండల్ కేసులో దోషిగా తేలిన తర్వాత ఈ కామెంట్స్ చేశారు. చాలా రోజులుగా జరుగుతున్న నేరవిచారణ తనకంటే, తన భార్య మెలానియాపైనే ఎక్కువ ప్రభావం చూపించిందన్నారు. స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. విచారణ ఆఖరిరోజు తన పిల్లలు ముగ్గురు మాత్రమే కోర్టుకు హాజరయ్యారని పేర్కొన్నారు. ముగ్గురు పిల్లలు తనకు నైతిక మద్దతు ఇచ్చారని అన్నారు. కానీ, తన భార్య మెలానియా మాత్రం కోర్టుకు రాలేదన్నారు.

మెలానియాపైనే తీవ్ర ప్రభావం

తనను దోషిగా నిర్ధరించడాన్ని మెలానియా జీర్ణించుకోవడం కష్టమే అని అన్నారు. తనపై అభియోగాలు రుజువుకావడంతో తన కుటుంబసభ్యులపై అది తీవ్ర ప్రబావం చూపించిందన్నారు. తనకంటే ఎక్కువగా వారే బాధపడుతున్నారని అన్నారు. తాను దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడకపోయి ఉంటుందని.. అందుకే కోర్టుకు రాలేదేమో అని అన్నారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మెలానియా ఎల్లప్పుడూ ఆయన వెంటే ఉండేవారు. అధికార, ప్రైవేటు కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. అయితే, ట్రంప్ అధ్యక్ష పదవి కోల్పోయిన తర్వాత ఆయన చేపట్టిన ఏ ర్యాలీలోనూ ఆమె కనిపించలేదు. ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు.

34 అంశాల్లో ట్రంప్ దోషి

స్టార్మీ డేనియల్ కు సంబంధించిన సెక్స్ స్కాండల్ కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువైనట్లు న్యూయార్క్‌ కోర్టు ఇటీవలే తేల్చింది. దాదాపు 34 అంశాల్లో ట్రంప్ ను దోషిగా నిర్ధారించింది. ఇలా ఓ కేసులో దోషిగా తేలిన తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన బైడెన్‌తో తలపడనున్నున్నారు. నేరస్థుడిగానే బైడన్ పై పోటీకి దిగనున్నారు. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ నకు వ్యతిరేకంగా ఈ తీర్పు రావడం గమనార్హం.


Similar News