మన ‘శివశక్తి’కి అంతర్జాతీయ గుర్తింపు.. ఎందుకు ?
దిశ, నేషనల్ బ్యూరో : చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా మన ఇస్రో పంపిన రోవర్ ‘ప్రజ్ఞాన్’ చంద్రుడిపై తిరిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామకరణం చేసిన సంగతి తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో : చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా మన ఇస్రో పంపిన రోవర్ ‘ప్రజ్ఞాన్’ చంద్రుడిపై తిరిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మార్చి 19న ఈ పేరుకు అంతర్జాతీయ ఖగోళ సంఘం (ఐఏయూ) ఆమోదం తెలిపింది. చందమామపై రోవర్ ‘ప్రజ్ఞాన్’ సంచరించిన ప్రదేశాన్ని ‘శివశక్తి’ అని 2023 ఆగస్టు 26న బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ఇస్ట్రాక్) కేంద్రం వేదికగా ప్రధాని మోడీ పిలిచారు. ఈ ప్రకటన చేసిన దాదాపు ఏడు నెలల తర్వాత ‘శివశక్తి’ పేరు వినియోగానికి అంతర్జాతీయ ఖగోళ సంఘం నుంచి అధికారిక అనుమతి లభించింది. ఇక చంద్రయాన్-2 రోవర్ పాదముద్రలు కలిగిన చంద్రుడి ఉపరితల ప్రదేశానికి ‘తిరంగా’ అనే పేరును ప్రధాని మోడీ అప్పట్లో ప్రకటించారు. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌కు పదిహేనేళ్ల ముందు (2008 నవంబర్ 14న) మన దేశానికి చెందిన చంద్రయాన్-1 మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఎంఐపీ) చంద్రుని ఉపరితలంపై దిగేందుకు యత్నించింది. ఆ ప్రదేశానికి ‘జవహర్ పాయింట్’ లేదా ‘జవహర్ స్థల్’ అనే పేరు పెట్టారు. దాన్ని కూడా అప్పట్లోనే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ధ్రువీకరించింది.