ఇటలీ ప్రధానిపై డీప్‌ఫేక్ వీడియో.. పరువు నష్టం దావా వేసిన జార్జియా మెలోని
ప్రధాని జార్జియా లక్ష యూరోల(మన కరెన్సీలో రూ. 90 లక్షలు) పరువు నష్టం దావా వేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్దీ దానివల్ల ఎదురయ్యే సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్‌ఫేక్ వీడియోల బెడద పెద్ద తలనొప్పిగా మారింది. ప్రముఖుల ముఖాలతో నకిలీ వీడియోలను రూపొందించి నిందితులు ఇంటర్నెట్‌లో వైరల్ చేస్తున్నారు. తాజాగా డీప్‌ఫేక్ వీడియోలకు ఓ దేశ ప్రధాని కూడా బాధితులుగా మారడం గమనార్హం. ఇటలీ ప్రధానమత్రి జార్జియా మెలోనిపై కొందరు నిందితులు డీప్‌ఫేక్ వీడియోలను రూపొందించారు. ఆ వీడియోలు కాస్త ఆన్‌లైన్‌లో వైరల్ అవడంతో, ఆ కేసులో ప్రధాని జార్జియా లక్ష యూరోల(మన కరెన్సీలో రూ. 90 లక్షలు) పరువు నష్టం దావా వేశారు. జార్జియా ముఖాన్ని డీప్‌ఫేక్ టెక్నాలజీ సాయంతో ఇద్దరు వ్యక్తులు పోర్న్ వీడియోలను క్రియేట్ చేసి, ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. దీని గురించి తెలుసుకున్నా ఆమె కేసు నమోదు చేశారు. ఆ కేసులో 40 ఏళ్ల వ్యక్తితో పాటు అతని 73 ఏళ్ల తండ్రిని అరెస్టు చేశారు. డీప్‌ఫేక్ వీడియోను వారు 2022లో అమెరికా నుంచి అశ్లీల సైట్‌లో అప్‌లోడ్ చేసినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. నష్టపరిహారంగా కోరిన మొత్తాన్ని తాను హింసకు గురయ్యే బాధిత మహిళల సంక్షేమానికి విరాళంగా ఇవ్వనున్నట్టు మెలోని చెప్పారు. ఈ కేసు వ్యవహారంలో విచారణ కోసం మెలోని స్వయంగా జూలైలో కోర్టుకు హాజరు కానున్నారు. ఇటువంటి నష్టపరిహారం కేసులను ఇటలీలో తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు.