ISRO: విపత్తులు, అగ్నిపర్వతాల పర్యవేక్షణకు ఉద్దేశించిన ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శుక్రవారం ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది

Update: 2024-08-16 04:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శుక్రవారం ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఉదయం 9:17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఈ ప్రయోగం మొత్తం 17 నిమిషాల పాటు విజయవంతంగా సాగింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ భూమిని పర్యవేక్షించడమే కాకుండా విపత్తులు, అగ్నిపర్వతాల గురించిన సమాచారాన్ని అందిస్తుంది.

దీనిలో మొత్తం మూడు పేలోడ్‌లను అమర్చారు. అవి ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ పేలోడ్ (EOIR), గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-రిఫ్లెక్టోమెట్రీ పేలోడ్ (GNSS-R), SiC UV డోసిమీటర్. అగ్నిపర్వతాల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయడానికి పగలు, రాత్రి సమయాల్లో చిత్రాలను క్యాప్చర్ చేయడానికి మిడ్-వేవ్ IR (MIR), లాంగ్-వేవ్ IR (LWIR) బ్యాండ్‌లను ఏర్పాటు చేశారు. దీనిలో ఉన్నటువంటి GNSS-R పేలోడ్ సముద్ర ఉపరితల గాలి విశ్లేషణ, నేల తేమ అంచనా, హిమాలయ ప్రాంతంలో క్రియోస్పియర్ అధ్యయనాలు, వరదలను గుర్తించడం, లోతట్టు జలాలను గుర్తించడం వంటి రిమోట్ సెన్సింగ్‌ను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. భూమి పరిశీలన కోసం ఉద్దేశించిన ప్రయోగం విజయవంతం కావడంతో శాస్ర్తవేత్తలు సంతోషంలో మునిగిపోయారు.

Tags:    

Similar News