వచ్చే ఏడాది అంతరిక్షంలోకి మహిళా హ్యూమనాయిడ్: ISRO Chairman Somanath
ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ గగన్‌యాన్ మిషన్ కోసం మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్‌లను లేదా మహిళా శాత్రవేత్తలను పంపాలని భావిస్తోందని అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు....
తిరువనంతపురం: ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ గగన్‌యాన్ మిషన్ కోసం మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్‌లను లేదా మహిళా శాత్రవేత్తలను పంపాలని భావిస్తోందని అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో మహిళలను పంపడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఇస్రో తన మానవరహిత గగన్‌యాన్ అంతరిక్ష నౌకలో మహిళా హ్యూమనాయిడ్(మనిషిని పోలి ఉండే రోబోట్)ను పంపుతుందని ఆయన చెప్పారు. ప్రతిష్టాత్మక మిషన్‌లో భాగంగా మూడు రోజుల పాటు 400 కిలోమీటర్ల తక్కువ భూకక్ష్యలో అంతరిక్షంలోకి పంపి వారిని సురక్షితంగా భూమికి తీసుకురావాలనే లక్ష్యాన్ని ఇస్రో నిర్దేశించింది.
'భవిష్యత్తులో మహిళలను అంతరిక్షంలోకి పంపేందుకు అవసరమైన అభ్యర్థులను కనుగొనాల్సి ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అనంతరం మానవసహిత మిషన్‌ను 2025 నాటికి చేపడతామని, ఇది స్వల్పకాలిక మిషన్ అని సోమనాథ్ అన్నారు. గగన్‌యాన్ కోసం వైమానిక దళ ఫైటర్ పైలట్‌లను ఎంపిక చేస్తామని, ఆ తర్వాత శాస్త్రవేత్తలు వ్యోగగాములుగా వస్తారు. అనంతరం మహిళలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని నమ్ముతున్నాను. ఇప్పటికైతే మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్‌లు లేనందున అవకాశాలు తక్కువగా ఉన్నాయని సోమనాథ్ వివరించారు. అలాగే, 2035 నాటికి పూర్తిస్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నది ఇస్రో లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.