Israel: ఉత్తర లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడిలో 18 మంది మృతి

ఉత్తర ఐటౌపై జరిగిన దాడిలో కనీసం 18 మంది మరణించినట్టు లెబనీస్ రెడ్‌క్రాస్ తెలిపింది.

Update: 2024-10-14 18:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌లో హిజ్బుల్లాలతో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ తన దాడులను పెంచింది. సోమవారం క్రైస్తవుల జనాభా అధికంగా ఉన్న ఉత్తర ఐటౌపై జరిగిన దాడిలో కనీసం 18 మంది మరణించినట్టు లెబనీస్ రెడ్‌క్రాస్ తెలిపింది. ఇప్పటివరకు లెబనాన్‌లో ఇజ్రయెల్ సైనిక కార్యకలాపాలు ప్రధానంగా దక్షిణ, తూర్పు బెకా వ్యాలీ, బీరుట్ శివారు ప్రాంతాలపై ఉంది. ఉత్తర ప్రాంతంలో సమ్మె కారణంగా నివాసం కోల్పోయిన కుటుంబాలకు అద్దెకు ఇచ్చిన ఇంటిపై దాడి జరిగిందని ఐటౌ మేయర్ జోసెఫ్ ట్రాడ్ రాయిటర్స్‌తో చెప్పారు. ఈ ఘటనలో మరణించిన వారితో పాటు నలుగురు వ్యక్తులు గాయపడ్డారని రెడ్‌క్రాస్ వెల్లడించింది. సోమవారం దక్షిణ లెబనాన్ గుండా ప్రవహించే అవలీ నదికి ఉత్తరాన ఉన్న 25 గ్రామాల నివాసితులను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. అనంతరం ఈ ప్రాంతంలో తన దాడులను తీవ్రతరం చేసింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ దాడిలో దక్షిణ లెబనాన్‌లోని నబాటీహ్ ప్రాంతంలో హిజ్బుల్లా ఎలైట్ రద్వాన్ ఫోర్స్ యాంటీ ట్యాంక్ క్షిపణి యూనిట్ కమాండర్ ముహమ్మద్ కమెల్ నైమ్ మరణించినట్లు మిలిటరీ తెలిపింది.

ఇజ్రాయెల్, హిజ్బుల్లాల మధ్య యుద్ధ తీవ్రత పెరగడంతో సామాన్య ప్రజల పట్ల ఐక్యరాజయసమితి మానవ హక్కుల కార్యాలయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సోమవారం ఉత్తర గాజాపై భారీగా ఇజ్రాయెల్ దాడులకు దిగడంతో అక్కడే ఉన్న 10 వేలమందికి పైగా పౌరులు ఆహారం, కనీసం సామగ్రి లేకుండా చిక్కుకున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 'మధ్యప్రాచ్యం అంతటా ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాను మిగిలిన గాజా స్ట్రిప్ నుంచి పూర్తిగా వేరు చేసే స్థాయిలో దాడులకు దిగుతోంది. దీనివల్ల పాలస్తీన పౌరుల జీవితాలు, భద్రతను పూర్తిగా విస్మరిస్తోందని వెల్లడించింది. అలాగే, ఇజ్రాయెల్ బలగాలు ఇసుక దిబ్బలను ఏర్పాటు చేశాయని, ఉత్తర గాజాను సీల్ చేసి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కాల్పులు జరిగినట్టు నివేదికలు అందాయని యూఎన్ కార్యాలయం పేర్కొంది.

హిజ్బుల్లా డ్రోన్‌ దాడిలో 60 మందికి పైగా క్షతగాత్రులు..

మరోవైపు, ఇజ్రాయెల్‌లోని బిన్యామినా ప్రాంతంలో ఉన్న ఆర్మీ బేస్‌పై హిజ్బుల్లా డ్రోన్‌లతో దాడులు చేసింది. ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించగా, ఆ ప్రాంతమంతా రాకెట్ కాల్పులు, వైమానిక దాడుల సైరన్‌లతో మారుమోగిందని స్థానికులు చెప్పారు. 60 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. దాడి జరిగిన ప్రాంతం ఐడీఎఫ్ గొలాన్ బ్రిగేడ్‌కు చెందిన శిక్షణ శిబిరానికి చెందిన మెస్ అని, డ్రోన్లు ఒక్కసారిగా పడటంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పనిచేయలేదని తెలుస్తోంది. ఇజ్రాయెల్, లెబనీస్ మధ్య గత నెల నుంచి యుద్ధ తీవ్రత పెరిగిన తర్వాత ఇజ్రాయెల్ గడ్డపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని ఐడీఎఫ్‌ ప్రతినిధి చెప్పారు. 

Tags:    

Similar News