‘సోషల్’ ప్రచారం : బీజేపీలోకి ప్రకాశ్ రాజ్.. ముహూర్తం ఫిక్స్ ?
దిశ, నేషనల్ బ్యూరో : నటుడు ప్రకాశ్‌రాజ్ రూట్ మార్చుకున్నారా ? నిన్నమొన్నటి దాకా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించిన ఆయన అభిప్రాయం ఇప్పుడు మారిపోయిందా ?
దిశ, నేషనల్ బ్యూరో : నటుడు ప్రకాశ్‌రాజ్ రూట్ మార్చుకున్నారా ? నిన్నమొన్నటి దాకా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించిన ఆయన అభిప్రాయం ఇప్పుడు మారిపోయిందా ? అనే టాపిక్‌పై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. త్వరలోనే ప్రకాశ్‌రాజ్ బీజేపీలో చేరుతారని, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ తరఫున ప్రచారం చేస్తారంటూ సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. దీంతో ఈ వార్తలను తోసిపుచ్చుతూ నటుడు ప్రకాశ్‌రాజ్ వివరణ ఇచ్చారు. ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ ట్విట్టర్(ఎక్స్) వేదికగా వ్యంగ్యంగా ఒక పోస్ట్ చేశారు.
‘‘ఇది వాళ్లు చేసిన ప్రయత్నమేనని నేను అనుకుంటున్నా. నన్ను కొనేంత (సైద్ధాంతికంగా) ధనవంతులు కాదనే విషయాన్ని వాళ్లు గ్రహించి ఉంటారు.. మీరేం అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ?’’ అని తన పోస్టులో 59 ఏళ్ల ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు. దీనికి ‘జస్ట్ ఆస్కింగ్’ అనే ట్యాగ్‌ను యాడ్ చేశారు. ‘‘ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఏప్రిల్ 4న మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీలో చేరనున్నారు’’ అని పేర్కొంటూ ‘ది స్కిన్ డాక్టర్’ అనే వినియోగదారుడు చేసిన పోస్టును ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ పై కామెంట్ చేశారు. ఏప్రిల్ 4న మధ్యాహ్నం 2.56 గంటలకు ఆయన చేసిన ఈ పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయింది. లక్షలాది వ్యూస్‌ను సంపాదించింది. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రకాశ్ రాజ్ ఓడిపోయారు.