13 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
ఆహార వస్తువులు, ముడి పెట్రోలియం, తయారీ ధరలు పెరగడం వల్లే టోకు ద్రవ్యోల్బణం ఎగబాకిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దిశ, బిజినెస్ బ్యూరో: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్‌లో వార్షిక ప్రాతిపదికన 1.26 శాతానికి పెరిగి 13 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రకటనలో వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు మార్చిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.53 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఆహార వస్తువులు, విద్యుత్, ముడి పెట్రోలియం, సహజ వాయువు, ఆహార ఉత్పత్తుల తయారీ, ఇతర తయారీ మొదలైన వాటి ధరలు పెరగడం వల్లే టోకు ద్రవ్యోల్బణం ఎగబాకిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతకుముందు నెలలో 56.99 శాతం పెరిగిన ఉల్లి ధరలు ఏప్రిల్‌లో 59.75 శాతం పెరిగాయి. ఇదే సమయంలో బంగాళదుంపల ధరలు 71.97 శాతం పెరిగాయి. ఇక ముడి పెట్రోలియం, సహజవాయువు 4.97 శాతం ఇంధన, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం 1.38 శాతం పెరిగింది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా సమస్యల నేఅథ్యంలో ద్రవ్యోల్బణం అధికంగానే ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.