చైనాను చిత్తుగా ఓడించిన భారత బలగాలు
గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ – చైనా మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. ఇలాంటి టైంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ లో భాగంగా ఇరుదేశాల బలగాలు సరదాగా 'టగ్ ఆఫ్ వార్' ఆడాయి.
దిశ, నేషనల్ బ్యూరో: గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ – చైనా మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. ఇలాంటి టైంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్ లో భాగంగా ఇరుదేశాల బలగాలు సరదాగా 'టగ్ ఆఫ్ వార్' ఆడాయి. ఆఫ్రికాలోని సూడాన్ లో మోహరించిన చైనా బలగాలతో భారత దళాలు ఈ ఆటను ఆడాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. సరదాగా సాగిన ఈ ఆటలో భారత సైనికులు సత్తా చాటారు. చైనా దళాలను ఓడించి సంతోషంతో చిందులేశారు. ఈ ఆటకు సంబంధించిన వీడియోను ఆర్మీ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇండియా వర్సెస్ చైనా అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది.
సూడాన్ లో శాంతి ఒప్పందంలో భాగంగా ఐక్యరాజ్యసమితి బలగాలను మోహరించింది. యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ ద సూడాన్ పేరుతో ఏర్పాటు చేసిన మిషన్ లో భారత్ తో పాటు చైనా బలగాలు కూడా ఉన్నాయి. శాంతి స్థాపనకు కృషి చేయడంతో పాటు మానవతా సాయం, భద్రత, మానవ హక్కుల పరిరక్షణ, ఆఫ్రికా యూనియన్ మిషన్ కు మద్దతు పలకటం వంటి కార్యక్రమాలను ఇది చేపడుతోంది.