బ్రిటన్ నౌకపై హౌతీల ఎటాక్.. స్పందించిన భారత నేవీ.. ఏం చేసిందంటే ?
దిశ, నేషనల్ బ్యూరో: ఎర్ర సముద్రంలో ఏర్పడిన యుద్ధ మేఘాలు చివరకు భారత సైన్యం కూడా అలర్ట్ అయ్యేలా చేశాయి.
దిశ, నేషనల్ బ్యూరో: ఎర్ర సముద్రంలో ఏర్పడిన యుద్ధ మేఘాలు చివరకు భారత సైన్యం కూడా అలర్ట్ అయ్యేలా చేశాయి. సముద్ర జలాల్లో మోహరింపును పెంచేలా చేశాయి. తాజాగా ఎర్ర సముద్రం సమీపంలోని గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మీదుగా వెళ్తున్న బ్రిటన్ వాణిజ్య నౌక ‘మార్లిన్ లాండా’పై యెమన్ హౌతీ మిలిటెంట్లు క్షిపణి దాడికి తెగబడ్డారు. ఆ వెంటనే మార్లిన్ లాండా నౌక సమీపంలోని ఇతర నౌకలకు ఎస్ఓఎస్ మెసేజ్‌ను పంపింది. దీనికి అలర్ట్ అయిన భారత నౌకాదళానికి చెందిన గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ స్పందించింది. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి .. మార్లిన్ లాండా నౌకను అలుముకున్న మంటలను ఆర్పేందుకు సహాయం చేసింది. క్షిపణి దాడికి గురైన ఆ నౌకలో 22 మంది భారతీయులు, ఒక బంగ్లాదేశ్ సిబ్బంది ఉన్నారని భారత నౌకాదళం వెల్లడించింది. వాణిజ్య నౌకలను రక్షించడానికి తమవంతు సాయాన్ని తప్పక అందిస్తామని స్పష్టం చేసింది. ఇటీవల బ్రిటన్, అమెరికా సైన్యాలు యెమన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలపై ముమ్మరంగా దాడులు చేస్తున్నాయి. దీనికి ప్రతీకారంగా ఎర్రసముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించే ఆ రెండు దేశాల వాణిజ్య నౌకలను కూడా హౌతీ మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్రిటన్, అమెరికాల నౌకలను రక్షిస్తూ భారత్ సైతం పరోక్షంగా వాటికి దన్నుగా నిలుస్తామనే సంకేతాలను పంపింది. ఈ పరిణామంపై హౌతీలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.