పాక్ పీఎంతో కేంద్రమంత్రి జైశంకర్ కరచాలనం
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భారత మంత్రి ఎస్ జైశంకర్ కరచాలనం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌లో భారత కేంద్రమంత్రి అడుగుపెట్టక దశాబ్దం దాటింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు 2015, 2016 కాలంలో భారత్‌లో బీభత్సం సృష్టించిన నేపథ్యంలో ఆ దేశంతో భారత్ సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. పదేళ్లుగా పాకిస్తాన్‌తో చర్చలు లేవు. ఇన్నేళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో కరచాలం చేశారు. 20 సెకండ్లపాటు చేసిన షేక్ హ్యాండ్‌లో ఇద్దరూ పొడిపొడి మాటలు మాట్లాడుకున్నట్టు వీడియోకు చిక్కింది. ఎస్‌సీవో(షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్) సదస్సును పాకిస్తాన్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా అతిథులందరికీ ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అందరినీ పలకరించారు. ఇందులో భాగంగా వేదిక మీదికి వచ్చిన భారత మంత్రి ఎస్ జైశంకర్‌ను కూడా కరచాలనం చేసుకుని కాసేపు మాట్లాడారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్‌తో సత్సంబంధాల కోసం ప్రయత్నాలు జరిగాయి. మోదీ నేరుగా పాకిస్తాన్‌లో దిగి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ వెళ్లడం, ఆ తర్వాత అప్పటి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎస్‌సీవో సదస్సు కోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్లుతుండగా పాకిస్తాన్‌కు చేరుకున్నారు. అప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎస్ జైశంకర్ కూడా ఆమె వెంటే ఉన్నారు. తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి హోదాలో ఎస్‌సీవో సదస్సులో హాజరుకావడానికి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ వెళ్లారు.