ముక్కుతో టైపింగ్.. మూడోసారి సొంత రికార్డు బద్దలు
కీబోర్డుపై అతి తక్కువ టైంలో ముక్కుతో ఆల్పాబెట్ టైప్ చేసి వినోద్ కుమార్ చౌదరి రికార్డులకెక్కారు. వరుసగా మూడోసారి తన రికార్డుని తానే బద్దలు కొట్టుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: కీబోర్డుపై అతి తక్కువ టైంలో ముక్కుతో ఆల్పాబెట్ టైప్ చేసి వినోద్ కుమార్ చౌదరి రికార్డులకెక్కారు. వరుసగా మూడోసారి తన రికార్డుని తానే బద్దలు కొట్టుకున్నారు. ముక్కుతో కీబోర్డుపైన వర్ణమాలను అత్యంత వేగంగా టైప్ చేసి ఈ ఫీట్ ని అందుకున్నారు. 2023లో తొలిసారిగా 27.80 సెకన్లతో రికార్డు క్రియేట్ చేశారు. అదే ఏడాది రెండో ప్రయత్నంలో 26.73 సెకన్లతో తన రికార్డుని తానే అధిగమించారు. ఇప్పుడు ముక్కుతో కేవలం 25.66 సెకన్లలో ఆల్ఫాబెట్ ని టైప్ చేసి రికార్డు బ్రేక్ చేశారు. వినోద్ కుమార్ చౌదరి ముక్కుతో కీబోర్డు ఆపరేట్ చేస్తున్న వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేసింది. "మీరు మీ ముక్కుతో ఆల్ఫాబెట్ ను ఎంత త్వరగా టైప్ చేయగలరు?" అని ఆ పోస్టుకు క్యాప్షన్ జతచేసింది.
గిన్నీస్ రికార్డుపై వినోద్ కుమార్ స్పందించారు. తనను ‘టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారని తెలిపారు. ముక్కుతో టైపింగ్ చేయడంతో పాటు టైపింగ్ లో పలు రికార్డులు తన పేరిట ఉన్నాయన్నారు. తన వృత్తి టైపింగ్ అని.. అందులో రికార్డు సృష్టించాలని కోరుకున్నానని అన్నారు. గంటలతరబడి సాధన చేసి ఈ రికార్డు బ్రేక్ చేశానని పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్ లా తన పేరుతోనూ చాలా రికార్డులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సచిన్ లా రికార్డుల రారాజు అనిపించుకోవడమే తన జీవిత లక్ష్యమని అన్నారు.