పేదరిక నిర్మూలనలో భారత్ గ్రేట్ : ఐక్యరాజ్యసమితి

Update: 2023-07-11 16:27 GMT

న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనలో భారత్ గత 15 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఐరాసకు చెందిన గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క తాజా నివేదికను యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం భారత్‌లో పేదరికం 2005-06లో 55.1% ఉండగా.. 2019-21 నాటికి 16.4%కు పడిపోయింది. ఈ 15 ఏళ్లలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.

భారత్‌లో దారిద్ర్యరేఖకు దిగువన 2005-06లో 64.5 కోట్ల మంది ఉండగా.. 2015-16 నాటికి ఆ సంఖ్య 37 కోట్లకు, 2019-21 నాటికి 23 కోట్లకు పడిపోయింది. భారత్‌లో పౌష్టికాహారం అందని నిరుపేదలు 2005-06లో 44.3% మంది ఉండగా.. 2019-21 నాటికి 11.8%కు తగ్గిపోయారు. పిల్లల మరణాలు 4.5% నుంచి 1.5%కు తగ్గాయి. గ్యాస్ కనెక్షన్ లేని వారు 52.9% నుంచి 13.9%కు తగ్గారు.

వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారు 2005-06లో 50.4% ఉండగా.. 2019-21లో 11.3% కు తగ్గిపోయారు. తాగు నీటి సౌకర్యం అందుబాటులో లేనివారు 16.4% నుంచి 2.7%కు తగ్గారు. విద్యుత్ సౌకర్యం లేనివారు 29% నుంచి 2.1%కు తగ్గారు. సొంత ఇల్లు లేని వారు 44.9% నుంచి 13.6% కు పడిపోయారు.

అందుబాటులో లేని కొవిడ్ నాటి సమాచారం..

భారత్ తో పాటు కంబోడియా, చైనా, కాంగో, హోండురాస్, ఇండోనేషియా, మొరాకో, సెర్బియా, వియత్నాం వంటి 25 దేశాలు గత 15 ఏళ్లలో పేదరికాన్ని గణనీయ సంఖ్యలో తగ్గించుకున్నాయి. 2023లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం 110 దేశాల్లోని 610 కోట్ల మంది జనాభాలో 110 కోట్ల మంది (18% కంటే ఎక్కువ) తీవ్ర పేదరికంలో నివసిస్తున్నారు. ప్రతి ఆరుగురు పేదల్లో ఆఫ్రికా (53.4 కోట్ల మంది), దక్షిణాసియా (38.9 కోట్ల మంది) దేశాల్లోనే ఐదుగురు నివసిస్తున్నారు. మూడింట రెండొంతుల మంది పేదలు (73 కోట్ల మంది) అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నివసిస్తున్నారు.

ప్రపంచ జనాభాలో వెనుకబడిన దేశాల జనాభా 10% మాత్రమే. పేదరికంలో మాత్రం ఈ దేశాల వాటా 35% ఉండటం బాధాకరం. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వారిలో సగం మంది (56.6 కోట్ల మంది) 18 ఏళ్లలోపు పిల్లలే ఉన్నారు. పేదరికం రేటు పిల్లల్లో 27.7% ఉంటే.. పెద్దవారిలో 13.4% ఉంది. పేదరికం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తాండవిస్తోంది. మొత్తం పేదల్లో 84% మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అయితే.. కొవిడ్ మహమ్మారి కాలంలో సమగ్ర డేటా అందుబాటులో లేకపోవడంతో తాజా గణాంకాల్లో కొంత వ్యత్యాసం సంభవించే అవకాశం ఉందని ఐరాస ప్రతినిధులు తెలిపారు.


Similar News