‘ఇండియా’ కూటమి ‘ఉల్గులన్ న్యాయ్’ ర్యాలీ.. టాప్ పాయింట్స్ ఇవే

దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష పార్టీల నాయకులు మోడీ సర్కారు నిరంకుశత్వం ఎదుట తలవంచడం కంటే ఆత్మాభిమానంతో జైలుకు వెళ్లడానికే ఇష్టపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Update: 2024-04-21 18:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష పార్టీల నాయకులు మోడీ సర్కారు నిరంకుశత్వం ఎదుట తలవంచడం కంటే ఆత్మాభిమానంతో జైలుకు వెళ్లడానికే ఇష్టపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇండియా కూటమిని వీడను అని చెప్పినందుకే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్‌ను ఈడీ అరెస్టు చేసి జైల్లో వేసిందని ఆరోపించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కుట్రపూరితంగా బీజేపీ వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. ఆదివారం జార్ఖండ్‌ రాజధాని రాంచీలో విపక్ష కూటమి ‘ఇండియా’ నిర్వహించిన ‘ఉల్గులన్ న్యాయ్’ ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. ‘‘కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను జైల్లో వేసినా ఇండియా కూటమి బెదరలేదు.. మా కూటమి ఇంకా అంతం కాలేదు..సజీవంగానే ఉంది.. మేం ప్రజలకు మాత్రమే భయపడతాం. ఇతరులకు భయపడే ప్రసక్తే లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. గిరిజనులు, ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తే బీజేపీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఖర్గే వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రామమందిర శంకుస్థాపనకు, పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించకుండా గిరిజన సమాజాన్ని ప్రధాని మోడీ అవమానించారని ఆయన విరుచుకుపడ్డారు. ‘‘బీజేపీ ఆదివాసీలను అంటరానివారిగా పరిగణిస్తోంది’’ అని ఖర్గే పేర్కొన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150 నుంచి 180 సీట్లే వస్తాయని కాంగ్రెస్ చీఫ్ జోస్యం చెప్పారు. కాగా, ఈ సభలో హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌‌ల కోసం ఒక్కో కుర్చీని ఖాళీగా వదిలేశారు. వాటిపై ఇద్దరు నేతల పేర్లతో స్టిక్కర్లను అంటించారు. ఇద్దరు నేతలను ఈడీ అరెస్టు చేసిందనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ఈ ఏర్పాటు చేశారు.

రాముడు అందరివాడు : ఫరూక్ అబ్దుల్లా

రాముడు హిందువులతో పాటు అందరికీ చెందినవాడని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ‘‘ఒక పార్టీ నేతలు.. శ్రీరాముడు వాళ్లకు మాత్రమే సొంతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రపంచంలో అందరికీ చెందినవాడు. రాముడు ఒక్క హిందువులకే పరిమితం కాదు . ఇలాంటి సంకుచిత రాజకీయాలు చేయడం తగదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యాన్ని విఫలం కానివ్వను : హేమంత్ సోరెన్ (జైలు నుంచి సందేశం)

‘‘ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ యత్నిస్తోంది. నేను ప్రజాస్వామ్యాన్ని విఫలం కానివ్వను’’ అని జైలు నుంచి పంపిన సందేశంలో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. రాంచీలో జరిగిన సభ వేదికగా ఈ ప్రసంగాన్ని ఆయన భార్య కల్పనా సోరెన్ చదివి వినిపించారు.

జార్ఖండ్ చరిత్రను చెరివేసేందుకు బీజేపీ కుట్ర : చంపై సోరెన్

‘‘జార్ఖండ్ చరిత్ర, అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని చెరిపివేయాలని బీజేపీ భావిస్తోంది. ఆ పార్టీని ఓడించాల్సిన బాధ్యత రాష్ట్ర ఓటర్లపై ఉంది. బీజేపీ ఎంపీలు గెలిచినా పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై మాట్లాడరు. ఇండియా కూటమి అభ్యర్థులకు అవకాశం వస్తే.. సమస్యలన్నీ పార్లమెంటులో ప్రతిధ్వనిస్తాయి’’ అని జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ పేర్కొన్నారు.

భయం వల్లే బరితెగిస్తున్నారు : అఖిలేశ్

‘‘బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి ఓటమి భయం పట్టుకుంది. అందుకే వాళ్లు విపక్ష నేతలను వేధించడానికి బరితెగిస్తున్నారు. ఓటమికి చేరువైనప్పుడు, భయంలో మునిగిపోయినప్పుడు ఇలాగే చేస్తుంటారు’’ అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.

400 పార్ నినాదం ఫ్లాప్ : తేజస్వి యాదవ్

‘‘ఇండియా కూటమిని చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారు. ఆ భయంలోనే ‘‘400 పార్’’ నినాదాన్ని ఆయన వినిపిస్తున్నారు. ఈ నినాదం ఫెయిలైంది. ఈసారి బీజేపీ చాలా తక్కువ సీట్లు వస్తాయి. 400 సీట్లు రావడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు’’ అని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News