Super Rich : సూపర్ రిచ్ భారతీయులపై ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టీ సంచలన వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : భారత్(India)లోని సూపర్ రిచ్ వర్గం(Super Rich)పై ప్రఖ్యాత ఫ్రెంచ్ ఆర్థికవేత్త, ‘క్యాపిటల్ ఇన్ 21వ సెంచరీ’ పుస్తక రచయిత థామస్ పికెట్టీ(Economist Thomas Piketty) సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : భారత్(India)లోని సూపర్ రిచ్ వర్గం(Super Rich)పై ప్రఖ్యాత ఫ్రెంచ్ ఆర్థికవేత్త, ‘క్యాపిటల్ ఇన్ 21వ సెంచరీ’ పుస్తక రచయిత థామస్ పికెట్టీ(Economist Thomas Piketty) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో భారీగా ఉన్న ఆర్థిక అసమానతలు తగ్గాలంటే.. సూపర్ రిచ్ వ్యక్తులపై అదనంగా పన్నులు విధించక తప్పదన్నారు. ఢిల్లీలోని రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (ఆర్ఐఎస్) సంస్థ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భారత ఆర్థికవ్యవస్థపై థామస్ పికెట్టీ ప్రసంగించారు. రూ.10 కోట్లకు మించి వార్షిక ఆదాయాన్ని కలిగిన సంపన్నులపై 2 శాతం ‘సంపద పన్ను’ విధిస్తే భారతదేశ వార్షిక ఆదాయం 2.73 శాతం మేర పెరుగుతుందన్నారు. సగటున రూ.10 కోట్లు విలువైన ఆస్తిపై 33 శాతం వారసత్వపు పన్ను విధించే అంశాన్ని కూడా భారత్ పరిశీలించవచ్చని పేర్కొన్నారు.
అమెరికా, బ్రెజిల్ సంపన్నులను దాటేశారు..
సంపన్నులపై పన్నులు విధించే అంశంలో పరస్పరం సహకరించుకోవడానికి జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు ఈ ఏడాది జులైలో చేసిన ప్రతిజ్ఞను భారత్ అనుసరించాలని థామస్ పికెట్టీ సూచించారు. ‘‘భారతదేశ వార్షిక ఆదాయంలో టాప్ 1 శాతం సంపన్న భారతీయుల ఆదాయ వాటా అనేది.. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లోని టాప్ 1 శాతం సంపన్నుల ఆదాయాలను మించిపోయింది. ఈమేరకు వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ ఒక నివేదికను ప్రచురించింది’’ అని ఆయన తెలిపారు. ‘‘2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వార్షిక ఆదాయంలో 22.6 శాతం వాటా టాప్ 1 శాతం ధనవంతులదే ఉంది. అదే ఏడాది దేశంలోని మొత్తం సంపదలో 40.1 శాతం సదరు టాప్ 1 శాతం ధనవంతుల వద్దే ఉండిపోయింది’’ అని థామస్ పికెట్టీ గుర్తు చేశారు. ఈమేరకు ఆయన చేసిన ప్రతిపాదనలను ఇదే కార్యక్రమం వేదికగా భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు, వి.అనంత నాగేశ్వరన్ తోసిపుచ్చారు. ‘‘పన్నులను ఎంతగా పెంచితే ఆర్థిక వ్యవస్థలో అంతగా ఓవర్ ఫ్లో పెరిగిపోతుంది’’ అని ఆయన స్పష్టం చేశారు.
వారసత్వపు పన్నుతో..
సంపద పన్నును 2015 సంవత్సరంలో భారత ప్రభుత్వం రద్దు చేసింది. ‘‘వారసత్వపు పన్నును ప్రవేశపెడితే దేశంలోని మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు చిన్న మొత్తాల పొదుపులను వారి పిల్లలకు బదలాయించడం కష్టతరంగా మారుతుంది’’ అని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్లమెంటుకు తెలిపారు. ఇటీవలే విడుదలైన ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. భారత్‌లో 100 మంది అత్యంత ధనవంతుల మొత్తం సంపద ట్రిలియన్ డాలర్లు దాటేసింది. దేశంలో అపర కుబేరుల సంపద 1.1 ట్రిలియన్ డాలర్లు ఉంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 119.5 బిలియన్ డాలర్లతో నంబర్ 1 స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 116 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు.