అంతరిక్ష నౌకల నిర్మాణ కేంద్రంగా భారత్: ఇస్రో

Update: 2024-02-10 16:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని ‘భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ’(ఇస్రో) చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. మల్టీ నేషనల్ కంపెనీలు తమ అంతరిక్ష నౌకలు, రాకెట్ల నిర్మాణం, ప్రయోగాలకు భారత్ గ్లోబల్ హబ్‌గా మారడం ఎంతో దూరంలో లేదని వెల్లడించారు. కేరళలోని తిరువనంతపురంలో శనివారం జరిగిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ (ఎంబీఐఎఫ్ఎల్) అనే కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డ్ విన్నింగ్ రచయిత, ఇస్రో మాజీ ఇంజినీర్ అయిన వీజే జేమ్స్‌తో ముచ్చటించారు. ఇందులో సోమనాథ్ మాట్లాడుతూ, ‘భారత్‌లోనే రాకెట్లను నిర్మించి, ఇక్కడి నుంచే ఎందుకు ప్రయోగించకూడదు’ అని ప్రశ్నించారు. అందుకు, తగిన సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం యూఎస్‌కు చెందిన ‘బోయింగ్’ అనే సంస్థతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.

చంద్రయాన్, ఆదిత్య-ఎల్ 1 వంటి శాస్త్రీయ పరిశోధనలపై దృష్టి సారించి మరిన్ని ప్రయోగాలు చేపట్టాలనే లక్ష్యంతో ఉన్నామని సోమనాథ్ తెలిపారు. ప్రస్తుతం అలాంటి హై ప్రొఫైల్ మిషన్లు ఎప్పుడో ఒకసారి నిర్వహిస్తున్నామని, రాబోయే కాలంలో ఈ సంఖ్యను మరింత పెంచాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. మరింత స్థిరమైన సైన్స్ ప్రోగ్రామ్‌ను కలిగి ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు. భారత్‌కు సొంతంగా అంతరిక్ష కేంద్రం, సిబ్బందితో కూడిన అంతరిక్ష యాత్రలు, చంద్రుడు, అంగారక గ్రహాలకు మరిన్ని మిషన్లు పంపాలనే ప్రణాళికతో ఇస్రో ఉందని, ప్రస్తుతం తమ లక్ష్యం ఇదేనని ఉద్ఘాటించారు.


Tags:    

Similar News