ఎన్నికల్లో ఇండియా కూటమి 295 సీట్లు గెలుచుకుంటుంది.. ధీమా వ్యక్తం చేసిన ఖర్గే
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఎన్నికల్లో ఇండియా కూటమి 295 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఎన్నికల్లో ఇండియా కూటమి 295 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలందరూ భేటీ అయ్యారు. ఎన్నికలపైనే అందరూ చర్చ జరిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఖర్గే.. 295 సీట్లు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇండియా కూటమికి 295 సీట్లు
ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే నిర్ణయం వస్తుందని అన్నారు. కూటమిలోని నేతలు ప్రజల వద్దకే వెళ్లి సర్వే నిర్వహించామన్నారు. దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిపామని పేర్కొన్నారు. సర్వే ప్రకారమే 295 సీట్లు వస్తాయన్న విషయాన్ని వెల్లడిస్తున్నామన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు. అన్ని పార్టీలు తమ కార్యకర్తలకు సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రజలకు వాస్తవాలను చెప్పాలనుకుంటున్నామని తెలిపారు.
భేటీలో పాల్గొన్న సోనియా, రాహుల్
ఇక, ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, రాఘవ్ చడ్డా, ఝార్ఖండ్ సీఎం చంప సోరెన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. మరోవైపు.. బెంగాల్ లో తుదిదశ పోలింగ్ శనివారమే జరిగింది. దీంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ భేటీకి హాజరుకాలేదు.