పపువా న్యూ గినియాలో 2 వేల మంది సజీవ సమాధి.. ఆదుకున్న భారత్

నైరుతి పసిఫిక్‌లోని ద్వీప దేశమైన పపువా న్యూ గినియాలో ఘోర విషాదం నెలకొంది. కొండచరియలు విరిగిపడి 2 వేల మంది సజీవ సమాధి అయ్యారు.

Update: 2024-05-28 10:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నైరుతి పసిఫిక్‌లోని ద్వీప దేశమైన పపువా న్యూ గినియాలో ఘోర విషాదం నెలకొంది. కొండచరియలు విరిగిపడి 2 వేల మంది సజీవ సమాధి అయ్యారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పపువా న్యూ గినియాకు భారత్ అండగా నిలిచింది. తక్షణ సాయం కింద మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ద్వీప దేశానికి అన్ని రకాలుగా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొంది. మరోవైపు, ఈ ఘటనపై ప్రధాని మోడీ సానుభూతి వ్యక్తం చేశారు.

శుక్రవారం రాత్రి పపువా న్యూ గినియాలోని పర్వతప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు గ్రామాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ విపత్తు వల్ల సజీవ సమాధి అయిన వారి సంఖ్య 2 వేలకు పెరిగినట్లు ఆ దేశం ఐక్యరాజ్యసమితికి తెలిపింది. ఆ దేశానికి చెందిన జాతీయ విపత్తు కేంద్రం ఐక్యరాజ్యసమితికి లేఖ రాసింది. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. అంతర్జాతీయ సాయం కావాలని ఆ దేశం యూఎన్ సాయం కోరింది. దీంతో పలు దేశాలు స్పందించాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం విమానం, ఇతర పరికరాలను సాయంగా పంపింది. భారత్ మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. గతంలోనూ పపువా న్యూ గునియాకు భారత్‌ అండగా నిలిచింది. 2018లో సంభవించిన భూకంపం, 2019, 2023లో అగ్నిపర్వత విస్ఫోటనాలతో సహా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం అందించింది.


Similar News