ప్రియమైన నా కుటుంబ సభ్యులారా.. ఎన్నికల వేళ దేశ ప్రజలకు ప్రధాని మోడీ లేఖ
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదల కానున్న నేపథ్యంలో ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తమ పదేళ్ల పాలనలో బీజేపీ సర్కార్ సాధించిన విజయాలు, తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలను లేఖలో ప్రస్థావించారు. మరోసారి కలిసి పనిచేస్తామనే విశ్వాసం తనకుందంటూ రాబోయే ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ‘‘ప్రియమైన నా కుటుంబ సభ్యులారా..’’ అంటూ లేఖను ప్రారంభించారు. ‘‘ప్రియమైన నా కుటుంబ సభ్యులారా.. మన భాగస్వామ్యం దశాబ్దకాలం పూర్తి చేసుకునే దశలో ఉంది. 140 కోట్ల మంది భారతీయుల నమ్మకం, మద్దతు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. గత 10 ఏళ్లలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు మా ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం. పేదలు, రైతులు, యువత, మహిళల జీవన నాణ్యతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా గృహాలు, అందరికీ విద్యుత్, నీరు, ఎల్పీజీతోపాటు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం, రైతులకు ఆర్థిక సహాయం, మాతృ వందన యోజన ద్వారా మహిళలకు సహాయం, మరెన్నో ప్రయత్నాల విజయానికి మీరు నాపై ఉంచిన నమ్మకమే కారణం. మన దేశం సంప్రదాయం, ఆధునికత రెండింట్లోనూ సమాంతరంగా ముందుకు సాగుతోంది. గత దశాబ్దంలో తదుపరి తరం మౌలిక సదుపాయాల అపూర్వమైన నిర్మాణాన్ని చూసింది. ఈ విషయంలో ప్రతి పౌరుడూ గర్వపడుతున్నాడు. పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి నారీ శక్తి వందన్ చట్టంతోపాటు ట్రిపుల్ తలాక్‌పై కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం. జీఎస్టీ అమలు, ఆర్టికల్ 370 రద్దు, నూతన పార్లమెంటు భవన నిర్మాణం వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన చర్యలు తీసుకున్నాం. ఇలా దేశ సంక్షేమానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఆశావహమైన ప్రణాళికలను రూపొందించడానికి, వాటిని సజావుగా అమలు చేయడానికి మీ మద్దతు నాకు అపారమైన శక్తిని ఇస్తుంది. ఇక, వికసిత్ భారత్‌ను నిర్మించాలనే సంకల్పాన్ని నెరవేర్చడానికి మీ మద్దతు కోసం ఎదురుచూస్తున్నాను. మనం కలిసి మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని నేను విశ్వసిస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలతో.. మీ మోడీ’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.