ఈసారి గెలిస్తే 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్: ప్రధాని మోడీ

భారత వృద్ధి ప్రపంచం మొత్తంపై ప్రభావం చూపుతోంది. జీ20 శిఖరాగ్ర సమావేశమే ఇందుకు నిదర్శనం.

Update: 2024-02-05 13:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్లమెంటు చివరి ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థికవ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లే వాగ్దానాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తర్వాత తన మూడవ టర్మ్‌లో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గతవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. 'భారత వృద్ధి ప్రపంచం మొత్తంపై ప్రభావం చూపుతోంది. జీ20 శిఖరాగ్ర సమావేశమే ఇందుకు నిదర్శనం. ఇదే తరహాలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మార్చే హామీ నాది అని' మోడీ అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అదేమీ పెద్ద విషయం కాదన్నట్టు, దానంతట అదే జరుగుతుందని చెబుతున్నాయి. కానీ, అది ఎలా జరుగుతుందో, అందులో ప్రభుత్వ పాత్ర గురించి యువతకు చెప్పాలనుకుంటున్నట్టు మోడీ పేర్కొన్నారు. 2014లో భారత్ 11వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ నుంచి ఇప్పుడు ఐదవ ఆర్థికవ్యవస్థగా మారింది. త్వరలో తాను మూడవసారి అధికారంలోకి వచ్చాక 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా నిలవనుందన్నారు. ఈ అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్‌కు వందేళ్లు పడుతుందని మోడీ ఎద్దేవా చేశారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ అధికారంలో ఉండి, అంతే సమయం ప్రతిపక్షంలో ఉండాలని  కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు.  

Tags:    

Similar News