దేశ సేవలో అమరులు..రెండు నెలల్లో ఒకే ఫ్యామిలీలోని ఇద్దరు సైనికులు మృతి

ఉత్తరాఖండ్‌లోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే రెండు నెలల వ్యవధిలోనే ఆ ఫ్యామిలీలోని ఇద్దరు సైనికులు దేశ సేవలో అమరులయ్యారు.

Update: 2024-07-09 18:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే రెండు నెలల వ్యవధిలోనే ఆ ఫ్యామిలీలోని ఇద్దరు సైనికులు దేశ సేవలో అమరులయ్యారు. ఏప్రిల్‌లో ఒకరు మరణించగా..ఈ షాక్ నుంచి కోలు కోకముందే తాజాగా కశ్మీర్‌లోని కథువాలో జరిగిన ఉగ్రదాడిలో అదే కుటుంబానికి చెందిన మరొక జవాన్ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే..వరుసకు సోదరులయ్యే ప్రణయ్ నేగి(33), ఆదర్శ్ నేగిలు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ప్రణయ్ ఏప్రిల్ 30న లేహ్‌లోని ఎత్తైన ప్రదేశంలో విధులు నిర్వహిస్తూ ఆక్సిజన్ కొరత కారణంగా మరణించాడు. అలాగే సోమవారం కశ్మీర్‌లోని కథువాలో జరిగిన ఉగ్రదాడిలో ఆదర్మ్ అమరుడయ్యారు. ఆయన 2018లో గర్వాల్ రైఫిల్స్‌లో చేరారు. దీంతో రెండు నెలల్లోనే ఇద్దరు కుమారులు తమ నుంచి దూరం అవడంతో ఆ ఫ్యామిలీ తీవ్ర విషాదంలో మునిగి పోయింది.

ఆర్మీలో రైఫిల్‌మెన్‌గా పనిచేస్తున్న ఆదర్శ్‌ మామ బల్వంత్‌సింగ్‌ నేగి మాట్లాడుతూ.. ‘రెండు నెలల్లో ఇద్దరు కుమారులను కోల్పోయాం. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. సైన్యంలో ఉద్యోగం సంపాదించాలంటే చాలా కష్టపడాలి. గర్హ్వాల్,కుమావోన్ నుండి దేశానికి సేవ చేయడానికి వెళ్ళిన పిల్లలు తరచుగా అమరవీరులుగా తిరిగి వస్తారు. ఇది మొత్తం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కథువా ఘటనలో మరణించిన సైనికులందరూ ఉత్తరాఖండ్‌కు చెందిన వారే కావడం గమనార్హం. 


Similar News