Suresh Gopi : అలా అయితే ఈ కేంద్ర మంత్రి పదవి నాకొద్దు.. సురేశ్ గోపి హాట్ కామెంట్స్

తన కేంద్ర మంత్రి పదవి పై బీజేపీ ఎంపీ, నటుడు సురేశ్ గోపి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-22 06:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖల సహాయ మంత్రి, నటుడు సురేశ్ గోపీ తన మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల కోసం తనను మంత్రి పదవి నుంచి తప్పించినా పర్వాలేదని అలా జరిగితే బతికిపోయానని అనుకుంటానన్నారు. నేనెప్పుడూ మంత్రిని కావాలని అనుకోలేదని, ఇప్పటికీ ఆ ఆశ ఏమీ లేదన్నారు. నటన తన అభిరుచి అని వ్యాఖ్యానించారు. కేరళ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో తాజాగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా ఉంటూనే సినిమాలో యాక్టింగ్ చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇప్పటికే అనుమతిని సైతం కోరానని చెప్పారు. అయితే ఎన్ని సినిమాల్లో నటించాలని అనుకుంటున్నారని అమిత్ షా ప్రశ్నించారని, అందుకు తాను 22 సినిమాల్లో నటించాలని అనుకుంటున్నానని చెప్పగా వెంటనే తన లేఖను పక్కన పెట్టేశారని వివరించారు. అలా పక్కన పెట్టినా తనకు అనుమతి ఇస్తామని మాత్రం చెప్పానన్నారు. ‘ఒట్టకొంబన్’ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి అనుమతిని అభ్యర్థించానని అయితే అది ఇంకా అందలేదన్నారు. సెప్టెంబర్ 6 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారభిస్తున్నట్లు తెలిపారు.

షూటింగ్ స్పాట్ వద్దకే అధికారులు:

షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించేందుకు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులను వెంట ఉంచుకుంటానని చెప్పారు.ఈ మంత్రి పదవి నా కోసం కాదని నన్ను గెలిపించిన త్రిశ్శూరు ప్రజల కోసమే ఇచ్చారని అందుకు పార్టీ పెద్దల నిర్ణయాన్ని అంగీకరించానన్నారు. అంతే తప్ప నా అభిరుచి అయిన సినిమాలకు దూరంగా ఉండమంటే నేను బతకలేనని వ్యాఖ్యానించారు. కాగా గత లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని త్రిశ్షూరు స్థానం నుంచి గెలవడం ద్వారా బీజేపీ ఆ రాష్ట్రంలో ఖాతా తొలిసారి బోణీ కొట్టింది. అయితే కేంద్ర మంత్రి పదవి వచ్చాక ఆ పదవి తనకు ఆసక్తి లేదని సురేశ్ గోపీ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఉహాగానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆ ప్రచారాన్ని అప్పట్లోనే ఆయన ఖండించారు. తాజాగా సినిమాల కోసం తన మంత్రి పదవి పోయినా పర్వాలేదు అనేలా వ్యాఖ్యలు చేయడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 

Tags:    

Similar News