నేను బతికున్నంత వరకు వాటిని ఆమోదించను: అసోం సీఎం కీలక వ్యాఖ్యలు
అసోం సీఎం హిమంత బిస్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బతికున్నంత వరకు రాష్ట్రంలో ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం అమలులో ఉండబోదని స్పష్టం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: అసోం సీఎం హిమంత బిస్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బతికున్నంత వరకు రాష్ట్రంలో ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం అమలులో ఉండబోదని స్పష్టం చేశారు. బాల్య వివాహాలను సైతం అనుమతించబోమని తేల్చిచెప్పారు. అసోం ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టం-1935ను రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి నిరసనగా సోమవారం కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌లు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం సీఎం సభలో ప్రసంగిస్తూ వారిపై మండిపడ్డారు. ‘నేను జీవించి ఉన్నంత వరకు అసోంలో బాల్య వివాహాలు జరగనివ్వను. 2026లోపు వీటిని పూర్తిగా నిర్మూలిస్తా. ముస్లిం సమాజపు ఆడబిడ్డలను నాశనం చేసేందుకు కాంగ్రెస్ తెరలేపింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని రద్దు చేసిన తర్వాత రాష్ట్రంలోని ముస్లిం మహిళలు హింస, దోపిడి నుంచి విముక్తి పొందుతారని వెల్లడించారు. అంతకుముందు ఈ అంశంపై ఏఐయూడీఎఫ్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ బిశ్వజిత్ డైమరీ దానిని తిరస్కరించారు.